Begin typing your search above and press return to search.

ట్వీట్ తిప్పలు కొని తెచ్చుకున్న సునీల్ కుమార్.. ఇప్పుడేం జరగనుంది?

తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ ఆయనకు కొత్త తిప్పలు తెచ్చి పెట్టేలా మారింది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 4:18 AM GMT
ట్వీట్ తిప్పలు కొని తెచ్చుకున్న సునీల్ కుమార్.. ఇప్పుడేం జరగనుంది?
X

కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు.. మాట జారితే మాత్రం వెనక్కి తీసుకోలేం. ఇది పాతకాలపు మాట. మారిన కాలానికి.. పరిస్థితుల వేళ ఈ సామెతను కాస్త మారిస్తే.. కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ.. ట్వీట్ పోస్టు చేస్తే వెనక్కి తీసుకోలేమన్నట్లుగా పరిస్థితి మారింది. ట్వీట్ డిలీట్ చేయొచ్చు. కానీ.. అప్పటికే పోస్టుచేసిన దానికి సంబంధించిన ఆధారం స్క్రీన్ షాట్ తో వెంటాడుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితిని కొని తెచ్చుకున్నారు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్. తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ ఆయనకు కొత్త తిప్పలు తెచ్చి పెట్టేలా మారింది.

‘సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి.. సాక్షాత్తూ సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులోకొత్త ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అంటూ ఆయన చేసిన ట్వీట్ కాసేపటికే డిలీట్ చేసినా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఉండి ఎమ్మెల్యే కె.రఘురామ క్రష్ణరాజు కంప్లైంట్ మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసు స్టేషన్ లో సునీల్ కుమార్ మీద నమోదైన హత్యాయత్నం కేసుపై.. సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ అఖిల భారత సర్వీసు (ప్రవర్తన) నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సర్వీసు విధానాలకు భిన్నంగా ఆయన వ్యవహరించారని.. ఇందుకు పదిహేను రోజుల్లో లిఖితపూర్వకంగా లేదంటే నేరుగా వాదనలు వినిపించాలని ఆదేశించింది. వివరణలో అభియోగాలకే పరిమితం కావాలని.. గడువులోపు వాదనలువినిపించకపోతే తమ వద్దనున్న వివరాలు.. అందుబాటులోఉన్న సమాచారం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీనిపై ఎలాంటి ఒత్తిళ్లు తేవొద్దంటూ జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తనపై పెట్టిన కేసు నేపథ్యంలో జులై 12న ఉదయం 11.44 గంటల వేళలో సునీల్ కుమార్ ట్వీట్ చేయటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు.

మరోవైపు కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితుడైన పీవీ సునీల్ కుమార్ సాక్ష్యులను బెదిరిస్తున్నారంటూ ఎమ్మెల్యే రఘురామ ఇటీవ ముఖ్యమంత్రిచంద్రబాబుకు లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఆయనకు జారీ చేసిన ఉత్తర్వులు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై సునీల్ కుమార్ ఏ రీతిలో రియాక్టు అవుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.