Begin typing your search above and press return to search.

సునీతా విలియమ్స్ ఇంటర్వ్యూ... రిటన్ జర్నీపై క్లారిటీ!

గత ఏడాది జూన్ 6న 8 రోజుల మిషన్ లో భాగంగా సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్.. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Feb 2025 3:34 AM GMT
సునీతా విలియమ్స్  ఇంటర్వ్యూ... రిటన్  జర్నీపై క్లారిటీ!
X

గత ఏడాది జూన్ 6న 8 రోజుల మిషన్ లో భాగంగా సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్.. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వీరిద్దరూ అదే నెల 14న భూమికి తిరుగుపయనం కావాల్సి ఉంది. అయితే.. వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి.

దీంతో 8 రోజుల మిషన్ కాస్తా 8 నెలలు దాటిన పరిస్థితి. దీంతో.. అప్పటి నుంచి వారు అక్కడే చిక్కుకుపోయిన పరిస్థితి. మూడోసారి రోదసిలోకి వెళ్లిన సునీతా విలియమ్స్ ఇలా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నెలలు తరబడి చిక్కుకుపోవడంతో ఆమె ఆరోగ్యంపై రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె సీ.ఎన్.ఎన్. కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

అవును... ఊహించని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమెతో పాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్.. స్పేస్ నుంచి సీ.ఎన్.ఎన్.కు ఇచ్చిన ఇంటర్వూలో కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. వీరిద్దరూ త్వరలో భూమిపైకి చేరనున్నట్లు వెల్లడించారు.

ఇందులో భాగంగా వీరి కోసం మార్చి 12న స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ-10 అంతరిక్ష నౌకను పంపనున్నారు. ఈ సమయంలో.. నౌకలో కొత్తగా ఐ.ఎస్.ఎస్.లోకి రానున్న వ్యోమగాములు వీరి బాధ్యతలు తీసుకోనున్నారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలో తిరిగి భూమి మీదకు తామిద్దరమూ బయల్దేరతామని ఈ సందర్భంగా విల్మోర్ తెలిపారు.

కాగా... అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత, బుచ్ విల్ మోర్ లను తిరిగి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను కోరారని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో... త్వరలో ట్రంప్ చెప్పిన ఆ పని పూర్తిచేస్తామని ఎలాన్ మస్క్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన ఎలాన్ మస్క్... అంతరిక్షంలో చిక్కుకుపోయిన వారిని తీసుకొచ్చేందుకు జో బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని.. వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు. ఏది ఏమైనా.. తాజాగా ట్రంప్ చెప్పిన పని త్వరలో పూర్తి చేస్తామని ఎలాన్ మస్క్ వెల్లడించారు.