ఎట్టకేలకు బయలుదేరిన స్పెస్ రాకెట్.. వారంలో సునీతా విలియమ్స్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్.. బుచ్ విల్మోర్ లు వారంలో తిరిగి భూమి మీదకురానున్నారు.
By: Tupaki Desk | 16 March 2025 10:01 AM ISTతొమ్మిది నెలల నిరీక్షణకు తెర పడే సమయం ఆసన్నమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్.. బుచ్ విల్మోర్ లు వారంలో తిరిగి భూమి మీదకు రానున్నారు. కొన్ని నెలలుగా స్పేస్ రాకెట్ ప్రయోగానికి సిద్ధం కావటం.. చివర్లో వాయిదా పడటం.. సాంకేతిక సమస్యలతో సునీత విలియమ్స్ రాక ఆలస్యమవుతున్న వేళ..ఎలాన్ మస్క్ కుచెందిన స్పేస్ ఎక్స్ సంస్థ నాసా సహకారంతో క్రూ 10 మిషన్ ను షురూ చేసింది.
అమెరికాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగెన్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇందులో నలుగురు వ్యోమగాములు ఉన్నారు. వారిలో ఇద్దరుఅమెరికా.. ఒకరు రష్యా.. ఇంకొకరు జపాన్ కు చెందిన వారు ఉన్నారు. ఈ నలుగురు ఆర్నెల్లు ఐఎస్ఎస్ లో ఉండనున్నారు. గత సెప్టెంబరులో స్పేస్ ఎక్స్ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములతో కలిసి సునీత.. విల్మోర్ లు తిరిగి రానున్నారు. ఇందుకు వారం సమయం పడుతుందని చెబుతున్నారు. వీరు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అవుతారని చెబుతున్నారు.
నిజానికి సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం వారం రోజులే అనుకున్నారు. బోయింగ్ సంస్థ డెవలప్ చేసిన స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగాన్ని 2024 జూన్ లో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం ఎనిమిది రోజుల్లో వారు వెనక్కి తిరిగి రావాలి. కానీ.. స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్య తలెత్తటంతో తిరిగి రావటం కుదర్లేదు.
స్టార్ లైనర్ లో థ్రస్టర్లు ఫెయిల్ కావటం.. హీలియం గ్యాస్ లీక్ అవుతున్న విషయాన్ని గుర్తించారు. రిపేర్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వ్యోమగాముల్ని వెనక్కి తీసుకొస్తే.. ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరించటంతో స్టార్ లైనర్ ఖాళీగానే తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చాలాసార్లుప్రయత్నించినా ఫలించలేదు. ఈ వ్యవహారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ప్రచార అంశంగా మారింది.
తాము అధికారంలోకి వస్తే అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్ ను భూమి మీదకు క్షేమంగా తీసుకొస్తామని.. జో బైడెన్.. ట్రంప్ ఇద్దరు ప్రకటించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చొరవతో క్రూ10 మిషన్ మొదలైంది. అంతా అనుకున్నట్లు జరిగి.. మరెలాంటి ట్విస్టులు లేకుంటే వారంలో సునీతతో పాటు విల్మోర్ లు భూమి మీదకు అడుగు పెట్టనున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.