286 రోజులు.. భూమి చుట్టూ 4,577 రౌండ్లు.. కోలుకోవడానికి..?
దీంతో.. ఇప్పుడు ఆమె కోలుకోవడంపై చర్చ మొదలైంది.
By: Tupaki Desk | 19 March 2025 9:01 AM ISTఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతితి వ్యోమగామి సునీతా మిలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నవేళ.. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. దీంతో.. ఇప్పుడు ఆమె కోలుకోవడంపై చర్చ మొదలైంది.
అవును... తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీతా విలియమ్స్.. స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో తొమ్మిది నెలల పాటు సున్నా గురుత్వాకర్షణ శక్తిలో ఉండాల్సి వచ్చింది. దీంతో... ఆమె ఇప్పుడు భూమిపై ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.
అంతరిక్షంలో సునీత 286 రోజులు ఉండగా.. ఈ సమయంలో భూమి చుట్టూ 4,577 సార్లు తిరిగారు. ఈ క్రమంలో సుమారు 195.2 మిలియన్ కిలోమీటర్ల దూరం ఆమె ప్రయాణించారు. అన్ని మిలియన్ కిలోమీటర్లు అవిరామంగా ప్రయాణించి.. ఇప్పుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు.
ఈ సమయంలో వ్యోమగాములు ఇద్దరూ ప్రస్తుతం పునరావాస కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిద్దరూ ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల కలిగే ప్రభావానికి అలవాటు పడాల్సి ఉంటుంది. వాస్తవానికి అంతరిక్షంలో ద్రవాలు పైకి కదలడం వల్ల ముఖం ఉబ్బి, కాళ్లు సన్నబడాతాయి! తిరిగి భూమికి చేరుకున్నతర్వాత అది రివర్స్ అవుతుందని చెబుతున్నారు.
వాస్తవానికి అంతరిక్షంలో గుండె అంత కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. దీంతో.. కాల క్రమేణా దాన్ని పరిమాణం కొద్దిగా తగ్గవచ్చని అంటున్నారు. ఈ సమయంలో హృదయనాళ వ్యవస్థ తిరిగి సర్ధుబాటు కావడానికి సమయం పడుతుందని.. ఈ సమస్యలు ల్యాండింగ్ తర్వాత కొంతకాలం కొనసాగుతాయని చెబుతున్నారు.
రోదసిలో ఉన్న వ్యోమగాములకు ప్రతీ నెల రోజుల కాలానికి ఎముకలు 1 నుంచి 2 శాతం మేర సాంద్రతను కోల్పోతాయని చెబుతున్నారు. ఇదే వరుసగా ఆరు నెలల కాలంలో అయితే 10 శాతానికి పెరగొచ్చని చెబుతున్నారు. భూమి మీద వృద్ధుల్లో ఏటా ఇది 0.5 నుంచి 1 శాతం మేర ఇలాంటి క్షీణత ఉంటుంది. దీనివల్ల ఎముకలు విరిగే ముప్పు ఎక్కువ!
ఈ సమయంలో.. 45 రోజుల పునరావాస కార్యక్రమం కోసం వ్యోమగాములు ఇద్దరినీ హ్యూస్టన్ కు తీసుకెళ్లారు. అక్క్డే వీరికి భూ వాతావరణంలో తిరిగి జీవించడంలో తర్ఫీదు, ఇవ్వనున్నారని అంటున్నారు.