Begin typing your search above and press return to search.

బోరుకొచ్చిన బోయింగ్ కు చేతకాని పనిని.. మస్క్ క్రూ డ్రాగన్‌ చేసింది!

బోయింగ్ సీఎస్టీ-100 స్టార్ లైనర్ క్రూ -9 మిషన్‌లో భాగంగా సునీతా, విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో ఉండి పరిశోధనలు, ప్రయోగాలు చేయాలి.

By:  Tupaki Desk   |   19 March 2025 5:25 PM IST
బోరుకొచ్చిన బోయింగ్ కు చేతకాని పనిని.. మస్క్ క్రూ డ్రాగన్‌ చేసింది!
X

హమ్మయ్య.. ఎట్టకేలకు సునీతా విలియమ్స్ భూమ్మీద అడుగుపెట్టారు.. దీంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. సరిగ్గా 22 ఏళ్ల కిందట.. ఇదే సమయం (ఫిబ్రవరి).. అప్పట్లో కల్పనా చావ్లా.. ఇప్పుడు సునీతా విలియమ్స్.. ఇద్దరూ మహిళా వ్యోమగాములే.. ఇద్దరూ భారత సంతతి వారే.. కాగా, నాటి కల్పనా చావ్లా విషాదాంతాన్ని తలచుకుంటూ ఒకటే ఆందోళన.. దీంతో సునీతా భూమ్మీదకు తిరిగివస్తున్నారంటే ఒకరకమైన భయం పట్టుకుంది. చివరకు కథ సుఖాంతమైంది.

వాస్తవానికి కేవలం 8 రోజుల మిషన్ మీద అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు సునీత. కానీ, దాదాపు 9 నెలలపాటు చిక్కుకుపోయారు. గత ఏడాది జూన్ 5న సునీతా, బుచ్ విల్మోర్ లు బోయింగ్ స్టార్‌ లైనర్ క్రూ మిషన్ లో భాగంగా అంతరిక్షానికి వెళ్లారు. ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం.. బోయింగ్ స్టార్‌ లైనర్ స్పేస్‌ క్రాఫ్ట్ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చే సామర్థ్యాన్ని పరీక్షించడం.

బోయింగ్ సీఎస్టీ-100 స్టార్ లైనర్ క్రూ -9 మిషన్‌లో భాగంగా సునీతా, విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో ఉండి పరిశోధనలు, ప్రయోగాలు చేయాలి. ఈ మిషన్ సమయంలో స్పేస్‌ క్రాఫ్ట్‌ను స్వయంగా నడిపి చూడాలి. అయితే, స్టార్‌ లైనర్ స్పేస్‌ క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం రావడంతో వారి తిరుగు ప్రయాణం ఆలస్యమైంది. దీంతో వీరిద్దరూ దాదాపు 9 నెలలు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది.

స్టార్‌ లైనర్ స్పేస్‌ క్రాఫ్ట్‌ లోని 28 రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్‌లలో ఐదు ఫెయిల్ అయ్యాయి. ఐదు హీలియం లీక్‌ లు కూడా జరిగాయి. దీంతో భూమికి తిరిగి తీసుకురావడం ఏమాత్రం సురక్షితం కాదని తేలిపోయింది. చివరకు స్టార్‌ లైనర్ స్పేస్‌ క్రాఫ్ట్ గత ఏడాది సెప్టెంబరులో వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది.

బోయింగ్.. ఈ పేరు వినగానే ఒకప్పుడు అబ్బో అనేవారు.. ఈ సంస్ధ విమానం ఎక్కడం అంటే గర్వంగా ఫీలయ్యేవారు. కానీ, అలాంటి బోయింగ్ సంస్థ కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. బోయింగ్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు సునీతాను తీసుకురావడంలోనూ నవ్వుల పాలైంది. దీంతో ఈ బాధ్యతను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు అప్పగించారు.

స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌ క్రాఫ్ట్ నెలల వ్యవధిలోనే తన పని పూర్తిచేసింది. ఈ నెల 15న స్పేస్‌ ఎక్స్ నలుగురు వ్యోమగాములతో క్రూ-10 మిషన్‌ ప్రారంభించింది. క్రూ-9కి చెందిన నలుగురు వ్యోమగాములు తమ బాధ్యతలను క్రూ-10కి అప్పగించి స్పేస్‌ ఎక్స్‌ కు చెందిన క్రూ డ్రాగన్‌ ‘ఫ్రీడమ్‌’ లో భూమిపైకి చేరుకున్నారు.