అంతరిక్షంలో క్రిస్మస్ సందడి... సునీతా విలియమ్స్ లేటేస్ట్ అప్ డేట్ ఇదే!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.)లో ఉన్న నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సిబ్బంది అంతరిక్షంలోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 18 Dec 2024 11:30 AM GMTఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.)లో ఉన్న నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సిబ్బంది అంతరిక్షంలోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా... శాంటాక్లాస్ టోపీ ధరించి కనిపించారు సునీత. ఈ సమయంలో.. ఆమె తిరుగు ప్రయాణం, అంతకంటే ముందు ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది.
అవును... అంతరిక్షంలో క్రిస్మస్ సందడి మొదలైందని అంటున్నారు. తాజాగా నాసా జాన్సన్స్ స్పేస్ సెంటర్ ఎక్స్ వేదిక విడుదల చేసిన పోస్టులో ఈ విషయం వెల్లడింది. ఇదే సమయంలో.. అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్స్ హాలిడే కస్టమ్స్ ను పునఃసృష్టిస్తారని.. భూమి నుంచి పంపిన తాజా పదార్థాలతో తయారు చేసిన ప్రత్యేక భోజనాన్ని ఆనందిస్తారని అంటున్నారు.
ఇదే సమయంలో... ఈ క్రిస్మస్ కు ముందు వ్యోమగాములు వీడియో కాల్ ద్వారా తమ తమ కుటుంబం, స్నేహితులతో కనెక్ట్ అవుతారని కూడా భావిస్తున్నారని అంటున్నారు.
కాగా... ఈ ఏడాది జూన్ లో ఎనిమిది రోజుల మిషన్ కోసమని భూమిని విడిచిపెట్టి అంతరిక్షానికి బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు ఇప్పటికే సుమరు ఆరు నెలలుగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే. వారు బయలుదేరివెళ్లిన అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు.
అన్నీ అనుకూలంగా జరిగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమె భూమిపైకి తిరిగి రానున్నారని అంటున్నారు. మరోపక్క గత నెలలో సునీత విలియమ్స్ అంతరిక్షంలో థాంక్స్ గివింగ్ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోల్లో ఆమె బరువు తగ్గడం గురించిన పాత పుకార్లకు చెక్ పెట్టినట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా... మిషన్ అపూర్వమైన పొడిగింపు కారణంగా ఆహార కొరత ఉందని, ఆమె ఆరోగ్యం దెబ్బతింటున్నట్లుందని, అందుకే ఆమె బుగ్గలు బోలుగా ఉన్నాయని చెబుతూ దానికి సంబంధించిన ఫోటో నెట్టింట హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం గురించిన ఆందోళన నెలకొందనే చర్చ మొదలైంది. అయితే... ఆమె ఆ పుకార్లను తోసిపుచ్చారు.
అయితే... ఈ మిషన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని ఇటీవల నాసా వెల్లడించగా.. అందులోనూ మార్పులు తప్పదని తెలుస్తోంది. ఇందులో భాగంగా... సునీతా విలియమ్స్, విల్ మోర్ ల తిరుగు ప్రయాణం వచ్చే ఏడాది మార్చి కంటే ముందు ఉండటం కష్టమని.. ముందుగా చెప్పినట్లుగా ఫిబ్రవరి కంటే మరో నెల ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.