హిస్టరీ రిపీట్: ఆమే.. ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి
దీనికి వస్తున్న సమాధానం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం రేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
By: Tupaki Desk | 3 April 2024 5:30 AM GMTకాలం మారినా.. సిద్ధాంతాలు ఎంత కొత్తగా చెప్పినా.. ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత రోటీన్ గా సాగే సీనే తప్పించి.. విలక్షణంగా.. వినూత్నంగా నిర్ణయాలకు అవకాశం చాలా తక్కువనే అంశం మరోసారి నిరూపితం కానుందన్న మాట వినిపిస్తోంది. అవినీతి మీద పోరాటం చేసి.. యావత్ దేశాన్ని కదిలించేలా చేసిన ఉద్యమంలో నుంచి పుట్టిన ఉద్యమ నాయకుడు ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందారు అరవింద్ కేజ్రీవాల్.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయన జైలుకు వెళ్లటం తెలిసిందే. తనను అరెస్టు చేసినప్పటికీ తాను ముఖ్యమంత్రి పదవిని వదిలి పెట్టేది లేదన్న ఆయన.. జైలు నుంచి పాలిస్తున్నట్లుగా చెబుతున్నారు. జైలు నుంచి పాలన చేసే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వేళ.. ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు. అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఢిల్లీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అయితే.. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు ఎలా అయితే.. పాలన సాగించారో జైలు నుంచి కూడా అదే రిపీట్ చేస్తారని చెప్పినా.. అదేమంత ఈజీ కాదంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి పేరు మార్పుఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ.. సీఎం కుర్చీలో ఇప్పుడు ఎవరు కూర్చోనున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
దీనికి వస్తున్న సమాధానం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం రేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భర్త రాజకీయాల్లో ఉన్నా.. ఆమె మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే.. తన భర్తను అరెస్టు చేసిన సమయంలో మాత్రం బీజేపీపై ఆమె చేసిన విమర్శలు అందరిని ఆకట్టుకునేలా చేశాయి. దీంతో ఆమే తదుపరి సీఎంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
గడ్డి కుంభకోణంలో జైలుశిక్ష పడిన లాలూ ప్రసాద్ యాదవ్ కు బదులుగా ఆయన సతీమణి రబ్రీదేవి ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టటం తెలిసిందే. అదే సీన్ తాజాగా రిపీట్ అవుతుందని చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివిన ఆమె.. ఐఆర్ఎస్ అధికారిణిగా విధులు నిర్వర్తించి ఆ మధ్యన పదవీ విరమణ చేశారు. ప్రజల్లో ఉంటున్న ఆమె.. ఎన్నికల సమయంలోనూ ప్రచారాన్ని చురుగ్గా నిర్వహించినట్లుగా చెబుతారు. కేజ్రీవాల్ తో పాటు పార్టీకి చెందిన ముఖ్యులంతా జైల్లోనే ఉన్నందున.. సునీతకు సీఎం కుర్చీ దక్కటం అనివార్యమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.