వివేకా హత్య కేసు.. గవర్నర్ రంగంలోకి దిగాల్సిందేనా ?
ఇక వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతంగా జరిగేలా గవర్నర్ జోక్యం చేసుకుని సంబంధిత శాఖలను ఆదేశించాలని ఆమె కోరారు.
By: Tupaki Desk | 16 March 2025 2:58 PM ISTమాజీ మంత్రి వైఎస్ జగన్ సొంత చిన్నాన్న అయిన వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురి అయి మార్చి 15 నాటికి ఏకంగా ఆరేళ్ళు అయింది. వివేకానందరెడ్డి సరిగ్గా 2019 ఎన్నికల షెడ్యూల్ కి కొద్ది రోజుల ముందు మరణించారు. అప్పట్లో ఆయన హత్య రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అయితే ఈ కేసు విషయంలో మొదట వైసీపీ నేతలు గుండె పోటు అన్నారు. తరువాత గొడ్డలి పోటు అని పోస్టు మార్టం లో తేలింది.
నాడు అధికారంలో ఉన్న టీడీపీ మీదనే విమర్శలు చేశారు వైసీపీ అగ్ర నేతలు. మొత్తానికి 2019 ఎన్నికల ముందు సీబీఐ విచారణను డిమాండ్ చేసిన వైసీపీ నేతలు ఆ తరువాత మాత్రం ఏపీ పోలీసులతోనే విచారణ జరిపించారు. ఇక వివేకా కుమార్తె సునీత దీని మీద చేసిన న్యాయ పోరాటం తరువాత సీబీఐ విచారణకు ఆదేశించారు. జగన్ సీఎం గా ఉన్న మూడేళ్ళ కాలంలో ఈ కేసు ఒక కొలిక్కి రాలేదని నాటి వైసీపీ ప్రభుత్వం తెర వెనక నుంచి తనకు ఉన్న బలంతో అడ్డుకుంటోందని ఆరోపణలు చేసిన వైఎస్ వివేకా కుటుంబానికి కానీ నాటి వైసీపీ ప్రత్యర్ధి పార్టీలకు కానీ ఇపుడు ఈ కేసు ఇంకా అలాగే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏకంగా పది నెలలకు దగ్గర అవుతోంది. మరి ఈ కీలక సమయంలో అయినా వివేకా హత్య కేసుని ఎందుకు ఒక కొలిక్కి తేలేకపోతున్నారు అన్నదే చర్చగా ఉంది. వివేకా కుమార్తె సునీత అయితే ఆరేళ్ళు అయింది తన తండ్రి చనిపోయి. అయినా దోషులకు శిక్ష పడడం లేదు అని వాపోయారు.
అంతటితో ఆగని ఆమె ఏకంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్దకు వెళ్ళి ఈ కేసు మీద జోక్యం చేసుకోవాలని కోరడం సంచలనం రేపుతోంది. ఈ కేసు పూర్వాపరాలు అన్నీ ఆమె గవర్నర్ కి స్వయంగా వివరించారు. ఈ కేసులో నిందితులలో ఒకరు మినహా అందరూ బెయిల్ మీద బయటే ఉన్నారన్నది ఆమె తెలిపారు. ఇంత సుదీర్ఘమైన కాలం గడచినా ఈ కేసులో ఇంతవరకూ ఎవరికీ శిక్ష అయితే పడలేదు.
ఇక వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతంగా జరిగేలా గవర్నర్ జోక్యం చేసుకుని సంబంధిత శాఖలను ఆదేశించాలని ఆమె కోరారు. తన తండ్రిని అతి కిరాతకంగా ఎలా హత్య చేశారు అన్నది ఆమె పూర్తి వివరాలతో గవర్నర్ కి తెలిపారు. గత ఆరేళ్ళుగా ఈ కేసు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ కూడా ఆమె గవర్నర్ కి వివరించారు.
ఇదిలా ఉంటే ఈ కేసు ఇంకా ఎందుకు నత్తనడకగా సాగుతోంది అన్నది చర్చకు వస్తోంది. రాజకీయంగా ఒత్తిడి పెట్టే స్థితిలో అయితే వైసీపీ లేదు. ఆ పార్టీ అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతోంది. ఏపీలో కేంద్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయి. వివేకా కుమార్తె సునీత టీడీపీ కూటమికి మద్దతుగానే ఉన్నారు. ఆమెకు అధికార పార్టీలో మంచి సంబంధాలే ఉన్నాయని చెబుతారు.
మరి ఇన్ని రకాలుగా సానుకూలత ఉన్నా వివేకా హత్య కేసు మిస్టరీ వీడకపోవడం అంటే ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు. ఈ కేసు విషయంలో ఏమి జరుగుతోంది అన్నది అయితే అందరికీ ఉత్కంఠంగానే ఉంది. మరి గవర్నర్ రంగ ప్రవేశం చేయాలా ఆయన జోక్యంతో ఈ కేసు ముందుకు కదులుతుందా అన్నది అంతా చర్చించుకుంటున్నారు ఇక వివేకా హత్య కేసు మీద గత ఎన్నికల్లో సునీత షర్మిల చేసిన ప్రచారం వల్ల వైసీపీకి కడప జిల్లాలో దారుణమైన ఓటమి లభించింది.
వైసీపీ అయితే రాజకీయంగా ఈ కేసు వల్ల భారీగానే నష్టపోతోంది. నిందితులు ఎవరో తెలిస్తే వైసీపీకి లాభమా నష్టమా అన్నది పక్కన పెడితే ఒక మాజీ మంత్రికి కుటుంబానికి న్యాయం దక్కినట్లు అవుతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం పట్టుదల పడితే ఈ కేసుని చేదించవచ్చు అని ఒక వైపు వినిపిస్తూంటే మరో వైపు ఇది రాజకీయ అస్త్రంగానే ఈ రోజుకీ ఉండడం విశేషంగా చెప్పుకుంటున్నారు. మరి వివేకా హత్య చేసిన వారు ఇంతకీ ఎవరు అన్నది మాత్రం అతి పెద్ద ప్రశ్నగానే ఉంది.