చివరకు ఉత్త చేతులతోనే తిరిగి వచ్చేసింది!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ ఆపరేషన్ కేవలం పది రోజులు మాత్రమే.
By: Tupaki Desk | 7 Sep 2024 7:47 AM GMTఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సునీతా విలియమ్స్‌ను నాసా పంపించింది. గతంలోనూ ఆమె అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన అనుభవం ఉంది. దాంతో మరోసారి పంపించగా.. ఈసారి అక్కడ తలెత్తిన పలు సాంకేతిక కారణాలతో ఆమె అక్కడే చిక్కుకుపోయింది. వాటిని సరిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదు. దీంతో నెలలుగా ఆమె అక్కడే ఉండిపోయింది. అయితే.. తాజాగా మరోసారి ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ ఆపరేషన్ కేవలం పది రోజులు మాత్రమే. కానీ.. సాంకేతిక కారణాలతో ఆమె ఇంకా తిరిగిరాలేకపోతోంది. ఆమె ఇక ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. మరో వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌తో కలిసి ఆమె ఐఎస్ఎన్‌లో ఉన్నారు.
బోయింగ్ క్రూ ఫ్లైట్‌లో టెస్టులో భాగంగా నాసా వీరిని ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించిది. జూన్ 14న వీరు భూమికి మీదకు తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంది. ప్రయాణించిన బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్స్‌లో సమస్యలు తలెత్తాయి. అప్పటికే అది ఐఎస్ఎస్‌తో అనుసంధానమై ఉన్నా.. సర్వీస్ మాడ్యూల్‌లో హీలియం లీక్‌తోపాటు 28 థ్రస్టర్లలో 5 పూర్తిగా పనిచేయడం ఆగిపోయాయి.
దీనిని సరిచేసేందుకు బోయింగ్ సంస్థ రంగంలోకి దిగింది. అంతరిక్షంలో చిక్కుకున్న వారిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయత్నాలు ఫలించలేదు. సాంకేతిక సమస్య పరిష్కరించిన బోయింగ్.. వ్యోమగాములను తిరిగి భూమిపైకి చేర్చేందుకు స్టార్‌లైనర్ సురక్షితమే అని సూచించింది. కానీ.. ఇందుకు నాసా ఒప్పుకోలేదు. చివరకు వీరు ప్రయాణించిన క్యాప్సుల్ వారిని అక్కడే వదిలేసి చివరకు ఉత్త చేతులతోనే తిరిగి వచ్చేసింది.
సునీతా, విల్మోర్‌ను భూమి మీదకు తీసుకురావడానికి ఈసారి.. ఎలన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష ప్రైవేటు పరిశోధక సంస్థ స్పేస్ ఎక్స్ సహాయాన్ని తీసుకునేందుకు నాసా సిద్ధమైంది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌లో వీరిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు నాసా వెల్లడించింది. అయితే.. వారిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే తీసుకురాగలమని నాసా ప్రకటించింది.