Begin typing your search above and press return to search.

ఇక సునీత వంతు!

వైఎస్‌ షర్మిల బాటలోనే సునీత కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లోనే సునీత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవచ్చని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   17 Jan 2024 11:45 AM GMT
ఇక సునీత వంతు!
X

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే ఆయన సొంత చెల్లెలు వైఎస్‌ షర్మిల ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు షర్మిలకు కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్‌ షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమించడాన్ని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తగ్గట్టే ఆ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు పులి మీద పుట్రలా దివంగత సీఎం వైఎస్సార్‌ తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా వైఎస్‌ షర్మిల బాటలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారని సమాచారం.

2019 ఎన్నికల ముందు వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందులలోని ఆయన స్వగృహంలోనే దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. మొదట ఆయన గుండెపోటుతో మృతి చెందారని, రక్తపు వాంతులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన దారుణ హత్యకు గురయ్యారని వెల్లడైంది. ఇందుకు సంబంధించి నాటి టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవి తదితరులపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ హత్య చేసింది.. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, వాళ్ల అనుచరులు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి అని వివేకా కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన తండ్రి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ నేపథ్యంలో సీబీఐ ఇప్పటికే వైఎస్‌ భాస్కరరెడ్డి, సునీల్‌ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తదితరులను అరెస్టు చేసింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ ను కూడా అరెస్టు చేసినట్టు చూపింది.

మరోవైపు ఈ హత్యను తాము చేయలేదని ఆస్తుల కోసం వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి తదితరులే హత్య చేశారని నిందితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నిందితులను కాపాడుతున్నారని సునీత గతంలోనే ఆరోపించారు.

ఈ నేపథ్యంలో సునీత సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వైఎస్‌ షర్మిల బాటలోనే సునీత కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లోనే సునీత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవచ్చని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌ సభా స్థానం సునీత, పులివెందుల అసెంబ్లీ స్థానం వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగుతారని టాక్‌ నడుస్తోంది. తద్వారా తమ సోదరులపైనే వారిద్దరూ పోటీకి దిగుతారని సమాచారం. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్‌ జగన్, కడప ఎంపీగా ఆయన సోదరుడు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో షర్మిల, సునీత వీరిపైన కాంగ్రెస్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగితే రాజకీయం రసకందాయంలో పడ్డట్టేనని అంటున్నారు.