Begin typing your search above and press return to search.

సునీత ఘాటు వ్యాఖ్యలపై సజ్జల స్పందన ఇదే!

ఈ నేపథ్యంలో వైఎస్‌ వివేకా కుమార్తె సునీత వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు,

By:  Tupaki Desk   |   1 March 2024 10:12 AM GMT
సునీత ఘాటు వ్యాఖ్యలపై సజ్జల స్పందన ఇదే!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో ౖÐð సీపీకి ఓటేయొద్దని, తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపింది వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డేనని వివేకా కుమార్తె సునీత చేసిన తీవ్ర విమర్శలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలానికి కారణమయ్యాయి.

ఈ నేపథ్యంలో వైఎస్‌ వివేకా కుమార్తె సునీత వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. నేటితో సునీత ముసుగు తొలిగిపోయిందని వ్యాఖ్యానించారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని మరి చంద్రబాబును సునీత నాడు ఎందుకు ప్రశ్నించలేకపోయారని సజ్జల నిలదీశారు.

పులివెందులలో నాడు విజయమ్మను ఓడించడానికి వివేకానందరెడ్డిని దగ్గరకు తీసుకున్నారని సజ్జల గుర్తు చేశారు. వివేకా ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణమెవరని నిలదీశారు. చంద్రబాబు, బీటెక్‌ రవి కాదా అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులతో సునీత ఇప్పుడు ఎలా జట్టు కట్టారని మండిపడ్డారు.

సునీత ఈరోజు ముసుగు తీసేసిందన్నారు. ఆమె ఎవరి ప్రతినిధో ఇవాళ తెలిసిపోయిందన్నారు. ఆమె ఎవరికి కృతజ్ఞతలు తెలిపారో చూస్తే విషయం అందరికీ అర్థమవుతోందన్నారు. సునీత వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తెలిపారు. ఆమె మాటలకు తలా తోకా లేదన్నారు. సునీత మాటల వెనుక కుట్ర ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆమె వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు చేతిలో సునీత ఓ పావులా మారారని సజ్జల ధ్వజమెత్తారు.

వివేకా హత్య జరిగింది చంద్రబాబు హయాంలోనేనని సజ్జల గుర్తు చేశారు. నాలుగైదు రోజుల్లో తేలిపోవాల్సిన కేసు అని సునీతే అంటున్నారని గుర్తు చేశారు. మరి అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబును సునీత అడగాలి కదా అని నిలదీశారు. తండ్రిని నరికిన వాడిని సునీత అక్కున చేర్చుకోలేదా..? అని ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని సజ్జల అన్నారు. వివేకా కేసులో సునీత కుటుంబ సభ్యులపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. విచారణ అన్నింటిపైనా జరుగుతుందని చెప్పారు.