హెచ్ సీఏ నష్ట నివారణ.. సన్ రైజర్స్ తో సంధి.. కార్యదర్శే కీలకం
అయితే, బీఆర్ఎస్ హయాంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అయిన జగన్మోహన్ రావు సన్ రైజర్స్ తో సమావేశానికి దూరంగా ఉన్నారు.
By: Tupaki Desk | 2 April 2025 7:30 PMఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్, హైదరాబాద్ క్రికెట్ సంఘం మధ్య ఎట్టకేలకు సంధి కుదరింది. ఉచిత పాస్ ల వివాదంతో హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని సన్ రైజర్స్ హెచ్చరించడం.. తర్వాత తెలంగాణ ప్రభుత్వం కలగజేసుకోవడంతో వివాదం పెద్దదిగా మారిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నష్ట నివారణ చర్యలకు దిగింది. ఉచిత పాస్‌లు, ఇతర అంశాలపై సన్‌రైజర్స్ ప్రతినిధులతో హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్.దేవరాజ్ చర్చలు జరిపారు.
బీసీసీఐ, హెచ్‌సీఏ, సన్ రైజర్స్.. మధ్య కుదిరిన త్రిముఖ ఒప్పందాన్ని కచ్చితంగా పాటించాలని, గతంలోలానే స్టేడియం సామర్థ్యంలో పది శాతం పాస్ లను హెచ్‌సీఏకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతోపాటు సన్ రైజర్స్ కు సహకరిస్తామని హెచ్‌సీఏ తెలిపింది.
అయితే, బీఆర్ఎస్ హయాంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అయిన జగన్మోహన్ రావు సన్ రైజర్స్ తో సమావేశానికి దూరంగా ఉన్నారు. అసలు వివాదం ఆయన మీదనే కావడం గమనార్హం. నిర్దేశిత 10 శాతం కాకుండా అదనంగా ఇవ్వాలని ఆయన బెదిరించినట్లు, తమను ఇబ్బంది పెట్టినట్లు హెచ్‌సీఏ కోశాధికారికి సన్ రైజర్స్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్‌సీఏ వ్యవహారాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
హెచ్ సీఏ, సన్ రైజర్స్ మధ్య వివాదం రెండు రోజుల పాటు నలిగింది. అయితే, ఇరు వర్గాల స్పందనతో త్వరగా సమసింది. విజిలెన్స్ విభాగంతో సమావేశంలో సన్‌రైజర్స్, హెచ్ సీఏ ప్రతినిధులు పాల్గొన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ ప్రతి ఆటకు 3,900 కాంప్లిమెంటరీ టిక్కెట్లు ఇచ్చేందుకు అంగీకరించింది.
కాగా, హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును పూర్తిగా పక్కనపెట్టి కార్యదర్శి దేవ్ రాజ్ సారథ్యంలోనే చర్చలు జరిగాయి. ఈయన కాంగ్రెస్ సీనియర్ నేత, గతంలో బీఆర్ ఎస్ లోనూ కీలకంగా వ్యవహరించిన నాయకుడికి చెందిన మనిషి. ఆ నాయకుడి కుమార్తె జీహెచ్ఎంసీలో కీలక పదవిలో ఉన్నారు. మరోవైపు మాజీ సీఎం మనవడు, మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఒకరు కూడా చర్చల్లో కీలక పాత్ర పోషించారు. కానీ ,జగన్ మోహన్ రావు మాత్రం పాల్గొనలేదు.