Begin typing your search above and press return to search.

బుక్ మై షో నిర్వాహకులకు "సన్ బర్న్" సెగ!

న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో నిర్వహించ తలపెట్టిన "సన్ బర్న్" ఈవెంట్ వివాదంలో బుక్ మై షో నిర్వాహకులపై కేసు నమోదైంది.

By:  Tupaki Desk   |   28 Dec 2023 6:04 AM GMT
బుక్  మై షో నిర్వాహకులకు సన్  బర్న్ సెగ!
X

న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో నిర్వహించ తలపెట్టిన "సన్ బర్న్" ఈవెంట్ వివాదంలో బుక్ మై షో నిర్వాహకులపై కేసు నమోదైంది. అసలు అనుమతి ఇవ్వని ఈ కార్యక్రమానికి ఆన్ లైన్ లో టికెట్లు విక్రయించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించిన పోలీస్ అధికారులు.. గట్టిగా మందలించారు. నిబంధనలు పాటించాల్సిందేనని, హద్దు దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బుక్ మై షో నిర్వాహకులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

అవును... హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా "సన్ బర్న్" ఈవెంట్ కోసం నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అందుకు అనుమతి ఇవ్వలేదని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి స్పష్టం చేశారు. అయితే అప్పటికే మాదాపూర్ లోని హైటెక్ సిటీ సమీపంలో ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేసేస్తున్నట్లు తెలిసింది. పైగా ఈ ఈవెంట్ కు సంబంధించిన టిక్కెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉండటంతో అధికారులు మరింత సీరియస్ అయ్యారు.

ఇలా ఈవెంట్ కు పర్మిషన్ లేకున్నా ఆన్ లైన్ లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో... బుక్ మై షోతో పాటు "సన్ బర్న్" ఈవెంట్ నిర్వాహకులపైనా ఛీటింగ్ కేసు నమోదు చేశారని తెలుస్తుంది. పోలీసులు హెచ్చరించినప్పటికీ ఈ ఈవెంట్ కు సంబంధించిన టిక్కెట్లు బుక్ మై షో లో అందుబాటులో ఉండటమే దీనికి కారణం అని తెలుస్తుంది.

అసలేమిటీ "సన్ బర్న్"... ఏందుకు ఇంత వివాదం...?

"సన్ బర్న్" అనేది భారీ మ్యూజికల్ ఈవెంట్. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ ఈవెంట్ నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో మద్యంకు అనుమతి ఉంటుంది. దీంతో... ఈ అనుమతి చాటున మాదకద్రవ్యాలతో పాటు పలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని ఆరోపణలు ఉన్నాయి.

గతంలో హైదరాబాద్ లో జరిగిన ఈ సన్ బర్న్ ఈవెంట్స్ లో డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్... ఈ కార్యకరమానికి అనుమతి ఇచ్చేది లేదంటూ తేల్చి చేప్పారు. సీఎం ఆదేశాలతో పోలీసులు వీటిపై మరింత ఫోకస్ పెట్టారు. అనుమతి లేకుండా న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.