Begin typing your search above and press return to search.

అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్.. బ్యాక్టీరియా.. డేంజర్ లో సునీతా

‘ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే బ్యాక్టీరియాను సూపర్ బగ్ గా పిలుస్తారు. ఇది ఐఎస్ఎస్ లో ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

By:  Tupaki Desk   |   11 Jun 2024 2:30 PM GMT
అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్.. బ్యాక్టీరియా.. డేంజర్ లో సునీతా
X

మన సునీతా విలియమ్స్ రికార్డు స్థాయిలో మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లిందనే శుభవార్తను ఇంకా ఆస్వాదిస్తుండంగానే.. మరో ఆందోళనకర వార్త చెవినపడింది. బోయింగ్ సంస్థ రూపొందించిన స్పేస్ క్రాఫ్ట్ లో సునీతా, మరో వ్యోమగామి బారీ యూజిన్‌ తో కలిసి బయల్దేరడానికి ముందే అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. చివరి నిమిషంలో ఓసారి టూర్ క్యాన్సిల్ అయింది. ఎట్టకేలకు జూన్ 6న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టారు. ఈ నెల 13న వీరు తిరిగిరావాల్సి ఉంది.

సూపర్‌ బగ్‌ ఏం చేస్తుందో?

‘ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే బ్యాక్టీరియాను సూపర్ బగ్ గా పిలుస్తారు. ఇది ఐఎస్ఎస్ లో ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మూసి ఉండే (క్లోజ్డ్) వాతావరణంలో వేగంగా పెరుగుతుంది. మందులను నిరోధించగలిగేంత శక్తిమంతమైనది. అందుకే 'సూపర్ బగ్' అంటారు. శ్వాస కోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం కూడా చూపుతుంది.

మొత్తం 9 మందికీ ముప్పు?

ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో సునీతా సహా 9 మంది వ్యోవగాములున్నారు. వీరంతా సూపర్ బగ్ తో ఇబ్బందుల్లో పడ్డారు. ఈ ‘స్పేస్ బగ్స్‘ గ్రహాంతర జీవులకు సంబంధించింది కాదని, వ్యోమగాముల ద్వారా భూమి నుంచి అంతరిక్ష కేంద్రానికి చేరి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాములు భిన్నమైన ఆరోగ్య సవాళ్లు ఎదుర్కొంటారు. సంప్రదాయ వైద్యం అందదు. దీంతో వారి ఆరోగ్యంపై బ్యాక్టీరియా సూపర్ బగ్ ప్రభావం చూపుతుందా? లేదా? అని అంచనా వేస్తున్నారు.

ఈ పరిశోధనలకు నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ సారథ్యం వహిస్తుండడం విశేషం.

ఐఎస్ఎస్‌ లోని సూపర్ బగ్ జన్యువులు.. భూమిపై ఉన్నవాటికి భిన్నంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇతర సూక్ష్మజీవులతో సహా ఉనికిలో ఉన్న ఎంటర్‌బాక్టర్ బుగాండెన్సిస్ కొన్ని సందర్భాల్లో వాటి మనుగడకు సహకరించవచ్చని చెప్పారు. నాసా జేపీఎల్, ఐఐటీ మద్రాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఏఐ‌కు చెందిన ప్రొఫెసర్ కార్తీక్ రామన్ బృందం సంయుక్తంగా ఈ పరిశోధనలు నిర్వహిస్తున్నాయి.