రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ ఇంట తీవ్ర విషాధం!
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ ఇంట తీవ్ర విషాధం నెలకొంది. ఆయన భార్య కిరణ్మయి(46) మృతిచెందారు.
By: Tupaki Desk | 16 Sep 2023 6:34 AM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు పేరు మారుమోగిపోతోంది. ఆ సంగతి అలా ఉంటే... జైలు సూపరింటెండెంట్ ఇంట తీవ్ర విషాధం నెలకొంది.
అవును... రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ ఇంట తీవ్ర విషాధం నెలకొంది. ఆయన భార్య కిరణ్మయి(46) మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్, ఎస్పీ జగదీశ్ లు ఆస్పత్రికి వెళ్లి కిరణ్మయి మృతిపట్ల సంతాపం తెలిపారు.
అయితే అంతకముందు భార్య అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై వెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడి వల్లే రాహుల్ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు. ఫలితంగా చంద్రబాబుకు జైల్లో త్రెట్ ఉందని భారీ ఎత్తున కథనాలు ప్రచురించారు.
ఈ దుష్ప్రచారంపై ఎస్పీ జగదీష్ స్పందించారు... ఆ వార్తలను కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని, తమ డ్యూటీ తాము చేస్తున్నానమని స్పష్టం చేశారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని తెలిపారు.
ఇదే సమయంలో భార్య మరణంతో రాహుల్ సెలవును పొడిగించినట్లు జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్ తెలిపారు. ఆయన తిరిగి విధుల్లో చేరేవరకూ రాజమండ్రి సెంట్రల్ జైల్ పర్యవేక్షణ బాధ్యతలు తానే నిర్వర్తిస్తానని చెప్పారు. ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
కాగా... అనారోగ్యంతో ఉన్న తన భార్య ఆరోగ్యం విషమించిందని తెలుసుకుని అప్పటికప్పుడు సెలవు పెట్టి వెళ్లారు రాహుల్. దీంతో... దీనికి ఊహలు, అతిశయోక్తులు జోడించి రాజమండ్రి జైల్లో ఏదో జరగబోతుందంటూ కథనాలు వండించేసిన సంగతి తెలిసిందే.
చంద్రబాబుతో, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ ములాఖత్ అయిన కాసేపటికే జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టారని, ప్రభుత్వ పెద్దలు బలవంతంగా సెలవుపై పంపించటం వల్లే ఇదంతా జరుగుతోందని, జైలును కుట్రలకు కేంద్రంగా మారుస్తున్నారని పిచ్చి రాతలు రాసుకొచ్చారు! తాజాగా ఈ వార్గలను ఎస్పీ ఖండించారు.