Begin typing your search above and press return to search.

గవర్నర్ రజనీ...బీజేపీ తమిళ వ్యూహం

ఇదిలా ఉంటే తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. దిగ్గజ నేతలు కరుణానిధి, జయలలిత దివంగతులు అయ్యారు

By:  Tupaki Desk   |   5 Sep 2023 4:15 AM GMT
గవర్నర్ రజనీ...బీజేపీ తమిళ వ్యూహం
X

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ మీద బీజేపీకి అభిమానం బాగా పెరిగిపోతోంది. ఆయనకు ఒక ఉన్నతమైన పదవిని అందించాలన్నది బీజేపీ భావిస్తోంది. రజనీకాంత్ కి గవర్నర్ పదవి ఇవ్వడం ద్వారా తమిళనాట లక్షలాదిగా ఉన్న రజనీకాంత్ అభిమానులను తమ వైపు తిప్పుకోవచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడగా ఉంది.

సౌతిండియాలో బీజేపీకి 2024 ఎన్నికలు చాలా కీలకం. ఎందుకంటే ఈసారి ఉత్తరాదిన సీట్లు తగ్గుతాయని, అదే సమయంలో సౌతిండియాలో ఉన్న 129 ఎంపీ సీట్లలో సగానికి సగం అయినా సొంతం చేసుకుంటే బీజేపీకి కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావచ్చు అని ఒక అంచనాగా పెట్టుకుంది.

ఇదిలా ఉంటే తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. దిగ్గజ నేతలు కరుణానిధి, జయలలిత దివంగతులు అయ్యారు. ఈ నేపధ్యంలో తమిళనాట రజనీకాంత్ ని తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ వేయని ఎత్తులు లేవు. రజనీని తమతో కలుపుకోవాలని చూసింది.

అయితే రజనీ సొంతంగా పార్టీ పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన ఊగిసలాట ధోరణితో 2021లో అనారోగ్య కారణాలు చూపించి రాజకీయాలకు గుడ్ బై అనేశారు. అయినా సరే బీజేపీకి రజనీ కాంత్ మీద ఆశలు చావలేదు.

ఈ మధ్య కాలంలో వరస ఫ్లాప్స్ తో సతమతం అయిన రజనీ ఒకే ఒక్క మూవీతో తిరిగి సూపర్ ఫాం లోకి వచ్చేశారు. జైలర్ మూవీతో రికార్డులు తిరరగాశారు. దాంతో రజనీలో స్టామినా ఇంకిపోలేదు అని బీజేపీ సహా అందరూ మరోసారి ఆయన వైపు చూడడం మొదలైంది. రజనీ ఈ మధ్యనే పలువురు రాజకీయ ప్రముఖులను కూడా కలుసుకుని వచ్చారు.

అందులో కీలకం యూపీ సీఎం ఆదిత్యనాధ్ యోగీ. ఆయన బీజేపీ సీఎం. ఆయనకు రజనీ పాదాభివందనం కూడా చేశారు. దీని మీద పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. కానీ రజనీ ఆధ్యాత్మికతతోనే ఇదంతా చేశారు అని ఆయన అభిమానులు సర్దిచెప్పుకున్నారు.

అయితే రజనీకాంత్ బీజేపీ నేతలను వరసబెట్టి కలవడం వెనక ఆయన పరోక్ష రాజకీయ ఎంట్రీ ఉందని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దానికి మరింత బలం చేకూర్చేలా రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్ తాజాగా మీడియా ముందు చేసిన సంచలన వ్యాఖ్యలు తమిళనాడు మొత్తం వైరల్ అయ్యాయి.

తన సోదరుడు రజనీకాంత్ త్వరలో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించవచ్చూన్ని ఆయన అనడంతో రజనీ బీజేపీ బంధం మరోసారి తమిళ రాజకీయాలలో చర్చకు వచ్చేశాయి. పైగా రజనీకాంత్ సొంత సోదరుడు చేసిన ఈ ప్రకటన ప్రజల దృష్టిని ఆకర్షించింది.

యోగి ఆదిత్యనాథ్‌తో రజనీకాంత్ సమావేశం కావడమే బిజెపి వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా ఇప్పటికే మీడియా కోడై కూస్తోంది. అదే టైం లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనను రాష్ట్ర గవర్నర్‌గా నియమించవచ్చునన ఊహాగానాలు ఇపుడు మరింత హీట్ ని పెంచుతున్నాయి.

బీజేపీకి సౌతిండియా చాలా కీలకం అయిన వేళ ఎన్నికల ప్రచారానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ తారలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తోంది. ఈ వ్యూహానికి అనుగుణంగానే రజనీకాంత్‌ను గవర్నర్‌గా నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రజనీకాంత్‌ను గవర్నర్‌గా నియమించడం ద్వారా కీలకమైన ఎత్తుగడతో బీజేపీ ముందుకు సాగాలని చూస్తోంది అంటున్నారు. ఒక విధంగా రజనీ కాంత్ సినీ క్రేజ్ తో పాటు ఆయన ఆధ్యాత్మిక విశ్వాసాలు ఆయన జీవనశైలి ఇవన్నీ బిజెపి తమిళనాట పాతుకుపోవడానికి కారణం అవుతాయని, అందుకే జైలర్ రజనీని కాస్తా గవర్నర్ రజనీగా చేయాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. మరి దీనికి సంబంధించిన ప్రకటన తొందరలోనే రానుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.