ఇలా ఎప్పుడూ జరగలేదు.. ఫస్ట్ టైమ్ మోడీగారూ!
దేశంలో అనేక ప్రభుత్వాలు మారాయి. అనేక మంది నాయకులు వచ్చారు. ఎంతో మంది ప్రధాని పీఠం ఎక్కారు.
By: Tupaki Desk | 12 April 2025 8:54 AMదేశంలో అనేక ప్రభుత్వాలు మారాయి. అనేక మంది నాయకులు వచ్చారు. ఎంతో మంది ప్రధాని పీఠం ఎక్కారు. మరెంతో మంది రాష్ట్రపతులు కూడా అయ్యారు. ఇక, గవర్నర్ల వ్యవస్థకు అంతే లేదు. అయితే.. ఇప్పుడు తమిళనాడులో చోటు చేసుకున్న ఘటన లాంటిది స్వతంత్ర భారత దేశంలో 77 ఏళ్లలో ఎన్నడూ ఎప్పుడూ జరగలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ, నిజంగానే జరగలేదు.
ఏ ప్రభుత్వమైనా.. తాను తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ లేదా.. రాష్ట్రపతి ఆమోద ముద్రను వేయించు కుంటుంది. ఒకవేళ వారు తొలిసారి సదరు బిల్లులను తిప్పికొడితే.. వాటిని మరోసారి తప్పులు సరిచేసి మళ్లీ పంపిస్తుంది. ఇక, రెండోసారి కూడా వచ్చిన బిల్లును గవర్నర్ తిప్పి పంపడానికి కానీ.. కాదని సంతకం చేయకుండా ఉండేందుకు కానీ.. వీలు లేదని ఆర్టికల్ 141 చెబుతోంది.
అయితే.. తమిళనాడు గవర్నర్ ఎన్.రవి.. సుమారు 10 బిల్లులకు ఎలాంటి ఆమోదం చెప్పకుండా.. తిరస్క రణకూడా చేయకుండా.. తన కార్యాలయంలోనే ఉంచేసుకున్నారు. ఇవన్నీ చాలా కీలకమైనవని స్టాలిన్ సర్కారు చెప్పింది. ఒకవేళ బిల్లుల్లో తేడా ఉంటే మార్చి పంపుతామని కూడా.. ప్రాథేయ పడింది. కానీ, రాజకీయ దురుద్దేశాలు.. కేంద్ర పాలకుల అజెండాలను అమలు చేయాలన్న ఒకే ఒక నిర్ణయంతో వ్యవహరించిన గవర్నర్ రవి.. వాటిని పట్టించుకోలేదు.
దీంతో స్టాలిన్ సర్కారు సదరు 10 బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాస్తవానికి వాటిని తిరిగి గవర్నర్‌కో.. లేదా రాష్ట్రపతికో పంపించాలని సుప్రీంకోర్టు ఆదేశించవచ్చు. కానీ, అప్పటికే జాప్యం జరిగిపోవడం.. గవర్నర్ ఉద్దేశ పూర్వకంగా సర్కారును ఇరుకున పెట్టాలని ప్రయత్నించడం వంటివి కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయని చెప్పిన సుప్రీంకోర్టు.. సదరు బిల్లులను చట్టాలుగా మార్చుకునేందుకు స్టాలిన్‌కు సంచలన ఆదేశాలు ఇచ్చింది.
ఇదీ.. భారత దేశంలో తొలిసారి చోటు చేసుకున్న పరిణామం. నేరుగా ఒక కోర్టు.. బిల్లును చట్టంగా మార్చు కోమని ఏ ప్రభుత్వానికీ ఇప్పటి వరకు ఆదేశించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో శనివారం స్టాలిన్ సర్కారు సదరు పది బిల్లులను చట్టాలుగా మార్చి జీవోలు విడుదల చేసింది. వీటిని గవర్నర్ కానీ.. రాష్ట్రపతి కానీ.. ఆమోదించకపోవడం గమనార్హం. ఇది గవర్నర్ కన్నా.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు పెద్ద దెబ్బ అని అంటున్నారు పరిశీలకులు.