Begin typing your search above and press return to search.

పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో వణుకు? సుప్రీం సూచనలతో అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Feb 2025 11:23 AM GMT
పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో వణుకు? సుప్రీం సూచనలతో అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు
X

తెలంగాణ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా గతంలోనే మరో ముగ్గురిపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తోంది. ఈ నెల 10న ఈ రెండు పిటిషన్లు కలిపి విచారించనుంది. ఈలోగా ఎమ్మెల్యేల వివరణ తీసుకోవాలని భావించి నోటీసులు జారీచేసింది. మరోవైపు సుప్రీం సూచనలతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు కూడా ఎమ్మెల్యేల వివరణ కోరుతూ నోటీసులిచ్చారు.

ఇటు అసెంబ్లీ కార్యదర్శి, అటు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న పది మంది వలస ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. తాను అందుబాటులో లేకపోవడం వల్ల రేపు అందరం కలవాలని అనుకున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. రేపు పది మంది ఎమ్మెల్యేలు ఓ చోట సమావేశమై ఉమ్మడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొందరు.. ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ హస్తాన్ని అందుకున్నారు. అయితే బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్నే విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో కేసు వేశారు. మొత్తం పది మందిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే సుప్రీం కోర్టు నోటీసులతో తదుపరి నిర్ణయం తీసుకోడానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒకచోట సమావేశం కావాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. పార్టీ మారిన వారిలో మాజీ మంత్రులు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవెళ్ల), మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు) అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), బండ్ల క్రిష్ణమోహన్ (గద్వాల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), తెల్లం వెంకట్రావు భద్రాచలం ఉన్నారు. వీరిలో కడియం కుమార్తె కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో తమ న్యాయపోరాటానికి తిరుగులేని ఆధారాలు లభించాయని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు ఏం చెబుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.