అమరావతిపై సుప్రీంకోర్టులో అఫిడవిట్... ఏం ఉంది... !
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కార్పొరేషన్‌ను రద్దు చేయడంతో పాటు తిరిగి ఏకైక రాజధానిగా అమరావతిని నిర్మించదలచుకున్నట్టు సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్ వేసింది.
By: Tupaki Desk | 13 Dec 2024 9:30 PM GMTఏపీ రాజధాని అమరావతి అంశంపై సుప్రీంకోర్టులో చివరి విచారణ జరిగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది. తాము ఏకైక రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నట్టు... ఇందుకోసం వేసుకున్న ప్రణాళికలతో సహా అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అమరావతిని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే గత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ వస్తోంది. 2014లో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని ఏపీ రాజధానిగా తీర్మానిస్తూ కొంత అభివృద్ధి కూడా చేసింది.
ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే అమరావతి మాత్రమే కాకుండా ఏపీకి మూడు రాజధానులు ఉండాలని తీర్మానించింది. అమరావతి, విశాఖపట్నంతో పాటు కర్నూలును కూడా రాజధాని అంటూ తీర్మానించింది. ఇందుకోసం వైసీపీ ప్రభుత్వం రకరకాల మార్గాల్లో చట్టాలు చేసింది. మంగళగిరి - తాడేపల్లి మున్సిపాల్టీలను పూర్తిగా రద్దుచేయడంతో పాటు చాలా పంచాయతీలను కూడా రద్దు చేసి తాడేపల్లి - మంగళగిరి కార్పొరేషన్ సంస్థగా ఏర్పాటు చేసింది.
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కార్పొరేషన్‌ను రద్దు చేయడంతో పాటు తిరిగి ఏకైక రాజధానిగా అమరావతిని నిర్మించదలచుకున్నట్టు సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్ వేసింది. ప్రభుత్వం మారడంతో సహజంగానే తమ వాదన మార్చుకుంది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఉండదని .. అమరావతి వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.