మీరు అధికారంలో ఉంటే ఒకలా.. మీరు లేకుంటే మరోలా.. బాగుందయ్యా పాలన!
విద్య, సామాజిక సమీకరణలు వంటి కీలక విషయాల్లో
By: Tupaki Desk | 26 July 2023 4:02 AM GMTకేంద్రంలోని బీజేపీ సర్కారుపై సుప్రీంకోర్టు తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ''మీరు(బీజేపీ) అధికారంలో ఉంటే ఒక విధంగా వ్యవహరిస్తున్నారు. అనుకున్నవన్నీ.. ఆఘమేఘాలపై చేస్తున్నారు. అల్లర్లు జరిగినా.. అమానవీయ ఘటనలు జరిగినా మీకు బాగుంది. కానీ, మీరు అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రం స్పందించరు. ఇదేనా మీ పాలన తీరు. మీ నిర్ణయాత్మక విధానం'' అంటూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తాజాగా నిప్పులు చెరిగింది. దీంతో ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన అటార్నీ జనరల్‌కు వాయిస్ లేకుండా పోయింది.
ఏం జరిగింది?
విద్య, సామాజిక సమీకరణలు వంటి కీలక విషయాల్లో ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ దేశంలో రెండోస్థానంలో ఉంది. కేరళ తర్వాత విద్యలోనూ.. ముందుంది. దీంతో ఇక్కడ రాజకీయాల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది.దీనిపై అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులోనూ దాఖలయ్యాయి. గతంలోనే వీటిని విచారించిన సుప్రీంకోర్టు.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే.. ఇది జరిగి ఆరు మాసాలు అయినా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు స్పందించలేదు.
తాజాగా ఈ విషయంపై మరిన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే అధికారం కేంద్రానికే ఉందని పేర్కొంటూ.. ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. మోడీ సర్కారుపై నిప్పులు చెరిగింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ప్రేమ చూపిస్తున్నారని.. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది.
ఇతర రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారని, అదే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎలాంటి చర్యలు ఉండవ అని న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ నాగాలాండ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. అయితే, ఆ ఆదేశాలను పాటించడం లేదంటూ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలైంది.
రిజర్వేషన్ అనేది నిశ్చయాత్మక చర్య అని, మహిళా రిజర్వేషన్ దాని ఆధారంగా ఉంటుందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగ నిబంధనలకు భిన్నంగా ఎలా వ్యవహరిస్తారు? నాకు అర్ధంకాకుండా ఉందని జస్టిస్ ఎస్‌కె కౌల్ వ్యాఖ్యానించారు.