Begin typing your search above and press return to search.

ఓటుకు నోట్లు కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

తెలంగాణలో గతంలో సంచలనం రేపిన ఓటుకు నోట్లు కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది

By:  Tupaki Desk   |   10 Jan 2024 2:32 PM GMT
ఓటుకు నోట్లు కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!
X

తెలంగాణలో గతంలో సంచలనం రేపిన ఓటుకు నోట్లు కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ కు వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు సంగతి తెలిసిందే. ఆళ్ల పిటిషన్‌ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం ఎం సుందరేశ్, జస్టిస్‌ ఎస్వీ ఎన్‌ బట్టి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

అయితే తమకు మరికొంత సమయం కావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తరపు న్యాయవాదుల విజ్ఞప్తితో సుప్రీంకోర్టు కేసు విచారణను ధర్మాసనం ఈ ఏడాది ఏప్రిల్‌ కు వాయిదా వేసింది.

కాగా ఓటుకు నోటు’ కేసును విచారించే ట్రయల్‌ కోర్టు పరిధిని సవాలు చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణను సుప్రీం కోర్టు ఇప్పటికే నాలుగు వారాలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ట్రయల్‌ కోర్టు అధికార పరిధిని ప్రశ్నిస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వేసిన రివిజన్‌ పిటిషన్‌ ను 2021 జూన్‌ లో తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. రేవంత్‌ రెడ్డి సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఓట్లకు నోట్లు కేసు అప్పట్లో తెలంగాణలో సంచలనం సృష్టించింది. నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌ రెడ్డి, ఆ పార్టీ నేతలు వేం నరేందర్‌ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందడానికి కొంతమందికి ఓట్లకు నోట్లు ఆఫర్‌ చేశారని అభియోగాలు వచ్చాయి. నాడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తరఫున వీరు ఓట్లకు నోట్లు ఆఫర్‌ చేసి కొంతమందిని తమ పార్టీకి ఓటు వేసేలా నగదుతో ప్రేరేపించారని ఆరోపణలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పుడు నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సెబాస్టియన్, టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదుతో రేవంత్‌ రెడ్డితోపాటు పలువురిపై కేసు నమోదైంది.

మే 31, 2015న టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ కు రూ.50 లక్షలు నగదు ఇచ్చారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రేవంత్‌ రెడ్డితో పాటు మరికొందరిని అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. అనంతరం వారందరికీ బెయిల్‌ మంజూరైంది.

2015 జూలైలో, అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 120ఎ(నేరపూరిత కుట్ర) కింద రేవంత్‌ రెడ్డి, తదితరులపై ఏసీబీ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆడియో/వీడియో రికార్డింగ్‌ ల రూపంలో నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించామని ఏసీబీ వెల్లడించింది. స్టీఫెన్‌ సన్‌ కు ఇచ్చిన రూ. 50 లక్షలను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.