ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సర్టిఫికెట్.. ఏమనంటే!
ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాలన, ఈ క్రమం లో చోటు చేసుకుంటున్న దొంగ ఓటర్ల వ్యవహారం.. కొన్నాళ్లుగా యూపీని రాజకీయంగా విమర్శలపాలు చేస్తోంది.
By: Tupaki Desk | 14 Feb 2024 3:15 AM GMTకేంద్ర ఎన్నికల సంఘంపై ఒకవైపు పలు రాష్ట్రాల్లో దుమారం చెలరేగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాలన, ఈ క్రమం లో చోటు చేసుకుంటున్న దొంగ ఓటర్ల వ్యవహారం.. కొన్నాళ్లుగా యూపీని రాజకీయంగా విమర్శలపాలు చేస్తోంది. ప్రతిపక్షాలు ఏకంగా.. ధర్నాలు నిరసనలతో అట్టుడికిస్తున్నాయి. ఈ క్రమంలో మరో రాష్ట్రం ఛత్తీస్‌గఢ్లోనూ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అవక తవకలు జరిగాయని.. అనేక మంది పిర్యాదులు చేశారు. అయినా.. కేంద్ర ఎన్నికల సంఘం పెద్దగా స్పందించలేదు. ఈ క్రమంలో భారీ ఎత్తున ప్రజాప్రయోజన వ్యాజ్యాలు సుప్రీంకోర్టుకు చేరాయి. వీటిని విచారించిన సుప్రీం కోర్టు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్నికల సంఘం బాగా పనిచేస్తోందని.. తీర్పు చెప్పింది.
భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ప్రక్రియ పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ సంవిధాన్ బచావో ట్రస్టు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్ల సుప్రీం కోర్టు పరిష్కరించింది. డూప్లికేట్ మరియు ఘోస్టు ఓటర్లను తొలగించడానికి భారత ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోలేదని నిందించే అవకాశం ఏ మాత్రము లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ విషయంలో తదుపరి ఆదేశాలు అవసరం లేదని న్యాయ స్థానం తేల్చి చెప్పింది. పిల్స్ పై విచారణను ముగిస్తున్నట్లు కోర్టు తుది తీర్పులో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించే విధంగా భారత ఎన్నికల సంఘాన్ని అదేశించాలని కోరుతూ సంవిధాన్ బచావో ట్రస్టు సుప్రీం కోర్టులో పిల్ వేసింది.
ఈ కేసు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 మరియు ఓటర్ల నమోదు నియమాలు, నిబంధనలు -1960 ప్రకారము స్వచ్ఛమైన సమగ్ర ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అనుసరిస్తున్న ప్రక్రియను, తీసుకుంటున్న సమగ్ర చర్యలను సుప్రీం కోర్టుకు వివరించింది. స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించండంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న వ్యూహాత్మమైన చర్యలు, ప్రక్రియకు న్యాయ స్థానం సంతృప్తిని వ్యక్తం చేస్తూ సంవిధాన్ బచావో ట్రస్టు పిల్ ను పరిష్కరించింది.