Begin typing your search above and press return to search.

ప్రాస్టిట్యూట్‌ కాదు సెక్స్‌ వర్కర్‌... సుప్రీం హ్యాండ్‌ బుక్‌ రిలీజ్!

న్యాయస్థానాల్లో విచారణలు, వాదనలు, తీర్పుల్లో లింగ వివక్షకు తావు లేకుండా పదాలను వినియోగించడంపై సుప్రీంకోర్టు ఓ హ్యాండ్‌ బుక్‌ ను విడుదల చేసింది

By:  Tupaki Desk   |   17 Aug 2023 10:45 AM GMT
ప్రాస్టిట్యూట్‌ కాదు సెక్స్‌ వర్కర్‌... సుప్రీం హ్యాండ్‌ బుక్‌ రిలీజ్!
X

వేశ్య, వ్యభిచారిణి, ఉంపుడుగత్తె, ఉంపుడుగత్తె సంతానం తో పాటు మొదలైనవిధంగా లింగ వివక్షతో స్త్రీలను కించపరిచే పదాలను కోర్టుల్లో సంబోధించవద్దని సుప్రీం కోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి ఓ హ్యాండ్‌ బుక్‌ ను విడుదల చేసింది. ఇకపై కోర్టుల్లో ఈ హ్యాండ్ బుక్ సూచించిన పదాలనే వాడాలని పేర్కొంది.

అవును... న్యాయస్థానాల్లో విచారణలు, వాదనలు, తీర్పుల్లో లింగ వివక్షకు తావు లేకుండా పదాలను వినియోగించడంపై సుప్రీంకోర్టు ఓ హ్యాండ్‌ బుక్‌ ను విడుదల చేసింది. మహిళలను మూసధోరణిలో చులకన భావనతో చూసే పదాలను తొలగించింది! వాటి స్థానంలో వినియోగించాల్సిన ప్రత్యామ్నాయాలతో ఒక హ్యాండ్ బుక్ ను రూపొందించింది.

ఈ సందర్భంగా న్యాయ నిఘంటువుల నుంచి వివక్షాపూరిత పదాలను తొలగించడం కూడా ఈ పుస్తక లక్ష్యాల్లో ఒకటని పేర్కొంది. పురుషులతో సమానంగా మహిళలనూ గౌరవించాల్సి ఉందని స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ హ్యాండ్‌ బుక్‌ ను విడుదల చేసింది.

ముఖ్యంగా లైంగిక హింసకు గురైన బాధితులను న్యాయపరిభాషలో వివరించే సమయంలో మూసధోరణిని వీడేందుకు 30 పేజీల ఈ పుస్తకం తోడ్పడుతుందని జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. ఏ కారణంతో అయినా మహిళల పట్ల దురభిప్రాయాలను ఏర్పరచుకోవడం కానీ, ఆ కారణంతో వారిపై దురుసుగా ప్రవర్తించడం కానీ సమర్థనీయం కాదని స్పష్టంచేశారు.

ఇదే క్రమంలో... మగవాళ్లు అధికులు, ఆడవాళ్లు అల్పులనే భావజాలం నుంచి జడ్జీలు, న్యాయవాదులు కూడా బయటపడాల్సిన అవసరాన్ని జస్టిస్‌ చంద్రచూడ్‌ నొక్కి చెప్పారు. దీనికి సంబంధించిన ఈ "హ్యాండ్‌ బుక్‌ ఆన్‌ కంబాటింగ్‌ జెండర్‌ స్టీరియోటైప్స్‌"... సుప్రీంకోర్టు వెబ్‌ సైట్‌ లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా వాడుకలో ఉన్న కొన్ని పదాలు.. వాటిని సుప్రీంకోర్టు సూచించిన ప్రత్యామ్నాయ పదాలు కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..!

వేశ్య, వ్యభిచారిణి వంటి పదాలను సుప్రీంకోర్టు నిషేధించింది. దానికి బదులుగా సెక్స్‌ వర్కర్‌ అనే పదాన్ని సూచించింది. ఇదే అమయంలో ఉంపుడుగత్తె అనే పదానికి బదులుగా వివాహేతర లైంగిక సంబంధాలున్న మహిళ (ఉమన్‌ విత్‌ సెక్సువల్‌ రిలేషన్స్‌ అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ మ్యారేజి)గా పేర్కొనాలని తెలిపింది.

ఇదే క్రమంలో... ఉంపుడుగత్తె సంతానమని చెప్పేందుకు బాస్టర్డ్‌ అని కాకుండా అవివాహ దంపతుల సంతానం(నాన్‌ మారిటల్‌ చైల్డ్‌) అనాలని తెలిపింది. ఇదే సమయంలో హౌస్‌ వైఫ్‌ ను.. హోమ్‌ మేకర్‌ అనాలని తెలిపింది. ఇదే క్రమంలో... "ఈవ్‌ టీజింగ్‌"ని ఇకపై "స్ట్రీట్‌ సెక్సువల్‌ హరాస్మెంట్‌"గా పేర్కొనాలని సూచించింది.