నిప్పుతో చెలగాటం... గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం!
ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారానికి సంబందించిన విషయాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 11 Nov 2023 7:51 AM GMTగతకొన్ని రోజులుగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోనీ ముఖ్యమంత్రులకు.. లేదా ప్రభుత్వానికి - గవర్నర్ కూ మధ్య జరుగుతున్న వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ మొదలైన ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారానికి సంబందించిన విషయాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అవును... శాసనసభ తీర్మానించి పంపిన పలు బిల్లులకు ఆమోదం తెలిపేవిషయంలో గవర్నర్లు ఆలస్యం చేస్తున్నారని.. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని వివిధ రాష్ట్రాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మాటల యుద్ధాలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ తరుణంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రులు, గవర్నర్ల చేతుల మీదుగానే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుందని హితవు పలికింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పంజాబ్, తమిళనాడులకు చెందిన గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ కి సంబంధించిన పలు విచారణలు జరిపింది! ఇందులో పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాల తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. గవర్నర్ల ప్రవర్తన రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తన వాదన వినిపించారు!
ఈ సమయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... అసెంబ్లీని సమావేశపరచడం, బిల్లుల ఆమోదం తెలపడం వంటి విషయాల్లో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగా... “నిప్పుతో చెలగాటం ఆడుతున్నారంటూ పంజాబ్ గవర్నర్” ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
ఇదే క్రమంలో... అసెంబ్లీ సమావేశాన్ని రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం... శాసనసభ సమావేశాలపై సందేహాలు ప్రజల్లోకి వెళ్లడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించింది! అదేవిధంగా ఆ సమావేశాలు చెల్లుబాటు కావని ప్రకటించే అధికారం గవర్నర్ కు లేదని స్పష్టంచేసింది. ఇదే సమయంలో ఇక ఈ వివాదంపై విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.
ఇదే సమయంలో మరోపక్క తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం తెలపకుండా ఉద్దేశపూర్వకంగా అన్నట్లుగా అసాధారణ జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ పైనా త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
ఈ క్రమంలో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొంటూ,. దీనిపై కేంద్రం తన స్పందనను తెలపాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో... ఈ కేసులో అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ సహాయం అందించాలని కోరింది.
కాగా... అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ఆలస్యం చేస్తున్నారంటూ పంజాబ్ ప్రభుత్వం... అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులకు ఆమోదం తెలపకుండా అసాదారణ జాప్యం చేస్తున్నారని గవర్నర్ ఆర్.ఎన్.రవి విషయంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.