Begin typing your search above and press return to search.

ఎన్నికల బాండ్స్... క్విడ్ ప్రోకో!!

గతకొంతకాలంగా రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చుకునేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Feb 2024 9:32 AM GMT
ఎన్నికల బాండ్స్... క్విడ్ ప్రోకో!!
X

గతకొంతకాలంగా రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చుకునేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలతో ఈ బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయ్యి. ఈ నేపథ్యంలో ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.

అవును... రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చుకునేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ఈ బాండ్ల జారీ ప్రక్రియను బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై ఏకగీవ్ర తీర్పు ఇచ్చింది.

ఇదే సమయంలో... వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే అది సమాచార హక్కును ఉల్లంఘించడమేనని తెలిపిన ధర్మాసనం... నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం ఎట్టిపరిస్థితుల్లోనూ సమంజసం కాదని అభిప్రాయపడింది. ఇదే క్రమంలో... విరాళాలు ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచడం అంటే... ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించడమే అని తెలిపింది!

ఎస్.బీ.ఐ., ఈసీ లకు కీలక ఆదేశాలు!

ఇదే క్రమంలో ప్రధానంగా ఆయా కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్‌ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంవల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాల వివరాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆయా పార్టీల బాండ్ల వివరాల వెల్లడి విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘానికీ సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగా... 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకు ఆయా రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో... మార్చి 13వ తేదీలోగా ఆ వివరాలన్నింటినీ వెబ్‌ సైట్‌ లో ప్రచురించాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది.

సవరణతోనే అసలు తిరకాసు!

రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అంతవరకూ బాగానే ఉంది కానీ... తాము స్వీకరించిన విరాళాల వివరాలను ఆయా రాజకీయ పార్టీలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ “కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017” సవరణ చేసింది. దీంతో... ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి.