Begin typing your search above and press return to search.

క్రైమ్ సీన్ మార్చేశారు... సీబీఐ షాకింగ్ ఆరోపణలు... సుప్రీం కీలక ప్రశ్నలు!

ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ కోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పిస్తూ కీలక సంచలన ఆరోపణలు చేసింది!

By:  Tupaki Desk   |   22 Aug 2024 12:09 PM GMT
క్రైమ్  సీన్  మార్చేశారు...  సీబీఐ షాకింగ్  ఆరోపణలు... సుప్రీం కీలక ప్రశ్నలు!
X

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో గల ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పలు దారుణ విషయాలు ప్రచారంలోకి రావడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ కోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పిస్తూ కీలక సంచలన ఆరోపణలు చేసింది!

ఆవును... పశ్చిమ బెంగాల్ లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఈ మేరకు పలు కీలక విషయాలను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఇందులో భాగంగా... తాము వెళ్లేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సీబీఐ ఆరోపించింది.

ఈ సందర్భంగా... ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన ఐదు రోజుల తర్వాత దర్యాప్తును తమకు అప్పగించారని.. దీంతో ఇప్పుడు దర్యాప్తు సవాలుగా మారిందని సీబీఐ తెలిపింది. ఇదే క్రమంలో... బాధితురాలి దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయడం దిగ్భ్రాంతికరం అని తెలిపింది.

ఇదే సమయంలో... తొలుత ఆమెది ఆత్మహత్య అని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని.. ఈ ఘటనలో వాస్తవలను కప్పిపుచ్చుతున్నారని అనుమానించి బాధితురాలి సహోద్యోగులు, యువ వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబట్టారని.. దీంతో పోస్ట్ మార్టంను వీడియో తీశామని సీబీఐ... సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించింది.

సుప్రీంకోర్టు రియాక్షన్...!:

సీబీఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఈ సందర్భంగా కోల్ కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో... బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించినప్పుడు కూడా ఆమెది అసహజ మరణం అని రికార్డుల్లో ఆలస్యంగా నమోదు చేయడం తీవ్ర ఆందోళనకరమని తెలిపింది.

అంతేకాకుండా... అసహజ మరణం అని నమోదు చేయడానికి ముందే పోస్ట్ మార్టం నిర్వహించడం కూడా ఆశ్చర్యంగా ఉందని అంటూ... పోస్ట్ మార్టం జరిగిన 18 గంటల తర్వాత క్రైమ్ సీన్ ను సీల్ చేశారెందుకో అని ప్రశ్నించింది. ఈ కేసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు అనుమానాస్పదంగా ఉందని ధర్మాసనం పేర్కొంది.