Begin typing your search above and press return to search.

పిన్నెల్లికి మ‌రిన్ని ఆంక్ష‌లు.. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దు: సుప్రీంకోర్టు

ఇదేస‌మ‌యంలో పిన్నెల్లి ఎందుకు ఎలా త‌ప్పించుకున్నార‌నే విష‌యాన్ని శోధించ‌డంలో పోలీసులు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని వ్యాఖ్యానించింది.

By:  Tupaki Desk   |   3 Jun 2024 10:34 AM GMT
పిన్నెల్లికి మ‌రిన్ని ఆంక్ష‌లు.. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దు: సుప్రీంకోర్టు
X

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి వ్య‌వ‌హారంపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యా ఖ్యలు చేసింది. పిన్నెల్లిని అరెస్టు చేయ‌కుండా.. అడ్డుప‌డి ఏపీ హైకోర్టు చాలా పెద్ద త‌ప్పు చేసింద‌ని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా.. ఉండాలంటే.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా శిక్ష‌లు ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇదేస‌మ‌యంలో పిన్నెల్లి ఎందుకు ఎలా త‌ప్పించుకున్నార‌నే విష‌యాన్ని శోధించ‌డంలో పోలీసులు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని వ్యాఖ్యానించింది.

గ‌త నెల 13న జ‌రిగిన పోలింగ్ స‌మ‌యంలో పాల్వాయిగేటు పోలింగ్ బూత్ లోకి దౌర్జన్యం గా ప్ర‌వేశించి.. ఈవీఎం, వీవీ ప్యాట్‌ల‌ను ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. ఇదే స‌మ‌యంలో వీటిని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేష‌గిరిరావుపైనా హ‌త్యాయ‌త్నం చేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వైసీపీ నాయ‌కుల దాడిలో శేష‌గిరిరావు, సీఐ నారాయ‌ణ స్వామి కూడా.. తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ల త‌ర్వాత పిన్నెల్లి పారిపోయారు. అనంత‌రం.. ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించి ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు.

అంతేకాదు.. కౌంటింగ్ కేంద్రంలోకి ప్ర‌వేశించి... ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించుకునేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే.. దీనిపై శేష‌గిరిరావు.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని.. కౌంటింగ్ కేంద్రంలోరి పిన్నెల్లి రాకుండా అడ్డుకోవాల‌ని..అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన‌.. ముంద‌స్తు బెయిల్‌ను రద్దు చేయ‌డంతోపాటు.. ఆయ‌న‌ను త‌క్ష‌ణం అరెస్టు చేసేలా ఆదేశించాల‌ని కోరారు. ఈ పిటిష‌న్ల‌పై విచార‌ణ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశాల‌పై మండిప‌డింది.

అస‌లు పిన్నెల్లిని అరెస్టు కాకుండా.. అడ్డుకుని హైకోర్టు పెద్ద త‌ప్పు చేసింద‌ని పేర్కొంది. అయితే..జూన్ 6వ తేదీ వ‌ర‌కు.. కౌంటింగ్ కేంద్రంలోకి కానీ.. నియోజ‌క‌వ‌ర్గంలోకి కానీ.. పిన్నెల్లి ఎట్టి ప‌రిస్థితిలోనూ వెళ్లేందుకు వీలులేద‌ని పేర్కొంది. అంతేకాదు.. జూన్ 6న ఖ‌చ్చితంగా ఈ కేసును ప‌రిష్క‌రించాల‌ని ఏపీ హైకోర్టుకు నిర్దేశించింది.