కృష్ణ జన్మభూమి కేసు... మసీదు సర్వేపై సుప్రీం కీలక ఆదేశాలు!
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై స్టే ఇచ్చింది. అనంతరం... ఈ వ్యవహారంపై హిందూ సంఘాలకు నోటీసు జారీ చేసింది.
By: Tupaki Desk | 16 Jan 2024 7:56 AM GMTకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఉత్తరప్రదేశ్ లోని మథురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని హిందూ సంఘాలను ఆదేశించింది.
అవును... కృష్ణ జన్మభూమి కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక ఆదేశాలను జారీ చేసింది. షాహీ ఈద్గా మసీదులో సర్వే చేసేందుకు కమిషనర్ ను నియమించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది.
వాస్తవానికి ఉత్తర్ ప్రదేశ్ లోని మథురలో శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో షాహీ ఈద్గా నిర్మించారని, దీనిపై సర్వే చేయించాలంటూ మథుర జిల్లా కోర్టులో గతంలో 9 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే... ఈ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్ లో ఉండిపోవడంతో.. వాటన్నింటినీ జిల్లా కోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్లపై విచారణ జరిగింది.
ఈ నేపథ్యంలో... 17వ శతాబ్దం నాటి షాహీ ఈద్గా మసీదులో న్యాయస్థానం పర్యవేక్షణలో సర్వే నిర్వహణ కోసం అడ్వకేట్ కమిషనర్ ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో... సర్వే సందర్భంగా అక్కడి కట్టడాలు దెబ్బ తినకుండా చూడాలని, శాస్త్రీయ సర్వేను ఇరు పక్షాల తరఫు ప్రతినిధులు ప్రత్యక్షంగా గమనించవచ్చని తెలిపింది.
ఇలా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ముస్లిం కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో... ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై స్టే ఇచ్చింది. అనంతరం... ఈ వ్యవహారంపై హిందూ సంఘాలకు నోటీసు జారీ చేసింది. అదే సమయంలో ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
కాగా... మధురలో సుమారు 13.37 ఎకరాల భూమిలో శ్రీ కృష్ణుని ఆలయం ఉండేదని, దాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు.. షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయిన సంగతి తెలిసిందే. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్ మాన్ కు చెందినదిగా ప్రకటించాలని వారు కోరుతున్నారు. ఇదే సమయంలో మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని మరోవైపు పిటీషన్లు దాఖలయ్యాయి.