ఎంపీ, ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటే శిక్షార్హులే: సుప్రీంకోర్టు
చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని పేర్కొంది.
By: Tupaki Desk | 4 March 2024 7:06 AM GMTదేశవ్యాప్తంగా చట్టసభ సభ్యులకు సంబంధించిన లంచాలు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల విషయంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుల నుంచి మినహాయింపు ఎవరూ పొందలేరని తెలిపింది. లంచం కేసులో చట్టసభ సభ్యులకు మినహాయింపు లేదని చెప్పింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని పేర్కొంది.
ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. అదేసమయంలో 1998లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా ఏడుగురు సభ్యుల ధర్మాసనం కొట్టి వేసింది. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కొందరు ఎంపీలు డబ్బుల కట్టలతో లోక్‌సభలోకి ప్రవేశంచారు. వీరంతా జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం)కు చెందిన సభ్యులు. కొందరు ప్రశ్నలు అడిగేందుకు తమకు డబ్బులు ఇవ్వజూపారని వారు ఆరోపించారు.
ఇది అప్పట్లో పెను వివాదంగా మారింది. దీనిని విచారించిన అప్పటి సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. కేసును కొట్టి వేసింది. చట్ట సభల సభ్యులపై నమోదయ్యే కేసులను విచారించలేమని పేర్కొంది. ఇదిలావుంటే, ఇటీవల తృణమూల్‌కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు.. మహువా మొయిత్రా కూడా ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమెను సభనుంచి సస్పెండ్ కూడా చేశారు.
ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ఆమెకు వ్యతిరేకంగా నివేదిక కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించేందుకు సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కేసులకు సంబంధించి సంచలన తీర్పు ఇస్తూ.. సుప్రీంకోర్టు గత తీర్పును సైతం కొట్టి వేయడం గమనార్హం.