Begin typing your search above and press return to search.

పిండానికి కూడా జీవించే హక్కు ఉంటుంది.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

గర్భస్త పిండానికి కూడా జీవించే హక్కు ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిండాన్ని తొలగించే హక్కు ఎవరికి లేదని సూచించింది

By:  Tupaki Desk   |   15 May 2024 2:18 PM GMT
పిండానికి కూడా జీవించే హక్కు ఉంటుంది.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

గర్భస్త పిండానికి కూడా జీవించే హక్కు ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిండాన్ని తొలగించే హక్కు ఎవరికి లేదని సూచించింది. ఈ మేరకు 27 వారాల గర్భాన్ని తొలగించాలని 20 ఏళ్ల వివాహిత వేసిన పిటిషన్ పై కోర్టు ఇలా తెలియజేసింది. మే 3న తన గర్భాన్ని తొలగించేందుకు నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేసిన కోర్టు ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది.

కడుపులో ఉన్న బిడ్డకు జీవించే హక్కు లేదా అని ప్రశ్నించింది. చట్టం తల్లి గురించే మాట్లాడుతుందని ఆమె తరఫు న్యాయవాది తెలిపినా కోర్టు ఆక్షేపించింది. గర్భం దాల్చి 7 నెలలు పూర్తయిందని పేర్కొంది. పిల్లలకు ఎదిగే హక్కు లేదా? పిండం కడుపులో ఉందని, ప్రసవించే వరకు అది తల్లి హక్కు అని ఆమె తరఫు న్యాయవాది వాదించినా ధర్మాసనం ఒప్పుకోలేదు.

ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. బాధితురాలు నీట్ పరీక్షకు హాజరవుతుందని అన్నారు. అందుకే ఆమె తరచు తరగతులు వినేందుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీని వల్ల ఆమె సమాజంలో తిరగలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని గర్భ స్రావానికి అనుమతి ఇవ్వాలని కోరినా ఫలితం లేకుండా పోయింది.

భ్రూణహత్య చట్టానికి విరుద్ధం. అందుకే ఆమె కడుపులో పెరుగుతున్న పిండంను చంపే హక్కు ఆమెకు లేదు. దీంతో ఆమె పిండాన్ని మోయాల్సిందే. బిడ్డను కనాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహాలు లేవని తేల్చింది. ఈ పరిస్థితుల్లో గర్భస్త పిండాన్ని తొలగిస్తే ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో ఆమె బిడ్డను కనే వరకు ఆగాలని సూచించింది.

కోర్టు తీర్పును శిరసావహించాల్సిందే. ఎన్ని కష్టాలున్నా బిడ్డ పుట్టే వరకు వేచి ఉండాల్సిందే. సమాజం కోసం కాకపోయినా ఆమె ఆరోగ్య రీత్యా అది మంచిది కాదని తేల్చింది. గర్భస్త శిశువుకు కూడా బతికే హక్కు ఉందని మరోమారు ఉద్ఘాటించింది.