Begin typing your search above and press return to search.

చీఫ్ జస్టిస్ ప్రస్తావించిన అరుణా షాన్ బాగ్ ఎవరు? ఆ కేసేంటి?

కోల్ కతా వైద్య విద్యార్థిని దారుణ హత్యాచార ఉదంతం యావత్ దేశాన్ని కదిలిస్తోంది.

By:  Tupaki Desk   |   21 Aug 2024 4:29 AM GMT
చీఫ్ జస్టిస్ ప్రస్తావించిన అరుణా షాన్ బాగ్ ఎవరు? ఆ కేసేంటి?
X

కోల్ కతా వైద్య విద్యార్థిని దారుణ హత్యాచార ఉదంతం యావత్ దేశాన్ని కదిలిస్తోంది. ఈ కేసును సుమోటో విచారణ మొదలు పెట్టిన భారత సర్వోన్నత న్యాయస్థానం.. క్షేత్రస్థాయిలో తీసుకురావాల్సిన మార్పుల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. మరో అత్యాచారమో.. హత్యనో జరిగే వరకు వేచి చూడొద్దని పేర్కొంది. పని ప్రదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. వ్యవస్థలోనే లైంగిక హింస మూలాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అరుణా షాన్ బాగ్ ఉదంతమే ఉదాహరణగా పేర్కొంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రస్తావించారు. ఇంతకూ అరుణా షాన్ బాగ్ ఎవరు? ఆ కేసేంటి? 1973లో దేశాన్ని కదలించేసిన ఈ దారుణ ఉదంతం గురించి తెలిసిన వారి మనసు చేదుగా మారటం ఖాయం. ఇంతకూ ఆ కేసేంటి? అన్న విషయంలోకి వెళితే..

1967లో అరుణా షాన్ బాగ్ నర్సుగా మహారాష్ట్రలోని కింగ్ ఎడ్వర్డ్ ఆసుపత్రిలో చేరారు. అప్పటికి ఆమె వయసు పాతికేళ్లు. డాక్టర్ సందీప్ సర్దేశాయ్ వద్ద ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఏడాదిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 1973, నవంబరు 27 రాత్రి ఆసుపత్రిలో పని చేసే వార్డుబాయ్ (సోహన్ లాల్) అనే రాక్షసుడు జరిపిన పాశవిక దాడికి గురయ్యారు. ఆమెను లైంగికంగా వేధించటంతో పాటు.. కుక్కలకు వాడే గొలుసుతో ఆమెను కట్టేశాడు. అత్యంత పాశవికంగా జరిపిన లైంగిక దాడిలో ఆమె మెదడుకు తీవ్ర గాయమైంది.

దీంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె మెదడు ఎడమ భాగం పని చేయటం మానేసింది. దీంతో మాట్లాడటం కష్టమైంది. మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఉదంతం అప్పట్లో దేశ వ్యాప్తంగా పెను సంచనలంగా మారింది. పని ప్రదేశంలో ఆమె దారుణ హింసకు గురి కావటంతో ఆమెకు కేఈఎం ఆసుపత్రిలోనే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైన ఈ కేసులో.. అరుణ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ 2011లో జర్నలిస్టు పింకీ విరాణి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే.. ఆమె వినతిని అత్యున్నత న్యాయస్థానం నో చెప్పింది. దాదాపు నాలుగు దశాబ్దాలు (40 ఏళ్లు) జీవచ్ఛవంలా గడిపిన ఆమె 2015లో న్యుమోనియాతో కన్నుమూసింది. జర్నలిస్టు పింకీ విరాణీ తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది.. ‘‘అరుణ అర్థవంతమైన జీవితానని గడపటం లేదు. అందుకు ఆమె కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలి’’ అని కోరారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైంది.

2011 మార్చి ఏడున ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇస్తూ.. అరుణ బ్రెయిన్ డెడ్ కాలేదని.. ఆసుపత్రి సిబ్బంది ఆమె బాగోగులు చేసుకుంటున్నట్లుగా పేర్కొంటూ.. ఆమె వినతిని నో చెప్పేశారు. సదరు జర్నలిస్టు అరుణా స్టోరీ పేరుతో ఒక పుస్తకం రాశారు. అందులో సోహన్ లాల్ దాడికి సంబంధించిన ఒక విషయాన్ని పేర్కొంటూ.. ఆసుపత్రిలో వైద్య ప్రయోగాల కోసం కుక్కల ఆహారాన్ని అతడు దొంగలించేవాడని.. ఆ విషయాన్ని గుర్తించిన అరుణ.. అతడికి వార్నింగ్ ఇచ్చిందట. దీంతో కక్ష పెంచుకున్న అతను.. ఆమెపై దారుణ లైంగిక హింసకు గురి చేశాడు.

ఇక్కడే మరో కీలక అంశాన్ని ప్రస్తావించాలి. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసేటప్పుడు నిందితుడి మీద దొంగతనం.. హత్యాయత్నం ఆరోపణలే తప్పించి.. లైంగిక హింసకు సంబంధించి అభియోగాలు మోపలేదు. ఈ కారణంగా అతడికి కేవలం ఏడేళ్లు మాత్రమే జైలుశిక్ష పడింది. చివరకు 1980లోనే అతను జైలు నుంచి విడుదల కాగా.. అతడి కారణంగా దారుణ హింసకు గురైన అరుణ మాత్రం జీవచ్ఛవంలా నలభై ఏళ్లు ఆసుపత్రి బెడ్ మీదే బతకాల్సి వచ్చింది.