ఎంత భారీగానో? 'పతంజలి'కి ఈ సారి గట్టిగా పడేట్లుందిగా?
తాజాగా యోగా గురువు రాందేవ్ బాబా.. ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలక్రిష్ణ భేషరతు క్షమాపణలు తెలుపుతు సుప్రీంకోర్టులో తమ అఫిడవిట్లను దాఖలు చేశారు.
By: Tupaki Desk | 11 April 2024 4:36 AM GMTఆకర్షణీయమైన ప్రకటనలతో.. అద్భుతాల్ని అతి చౌక ధరలకు అందిస్తున్నట్లుగా ప్రచారం చేసుకున్న పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ప్రకటనల అంశం ఆ సంస్థకు శాపంగా మారనుంది. తాజాగా సుప్రీంకోర్టు స్పందన చూశాక.. ఇది ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. తమ ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలపై తాజాగా యోగా గురువు రాందేవ్ బాబా.. ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలక్రిష్ణ భేషరతు క్షమాపణలు తెలుపుతు సుప్రీంకోర్టులో తమ అఫిడవిట్లను దాఖలు చేశారు. వీటిని రిజెక్టు చేసిన సుప్రీంకోర్టు.. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసి.. దొరికిపోయిన తర్వాత చెప్పే సారీలను తాము అంగీకరించమని తేల్చేశారు.
కరోనా నివారణలో అల్లోపతి మందుల పనితీరుపై అనుమానాలు కలిగేలా పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ప్రచారం జరిగిందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో భాగంగా విచారణ తాజాగా సుప్రీంలో జరిగింది.
తప్పుదోవ పట్టించేలా ఉన్న ప్రకటనలను ఇక చేయబోమని గతంలో హామీ ఇచ్చినప్పటికీ సదరు సంస్థ వాటిని పాటించకుండా.. తమ హామీని ఉల్లంఘించిన వైనంపై ఇప్పటికే సుప్రీంకోర్టు మండిపడింది. కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తాము భేషరతు క్షమాపణలు చెబుతున్నట్లుగా పేర్కొంటూ రాందేవ్ బాబా.. పతంజలి సంస్థకు కీలకంగా వ్యవహరించే ఆచార్య బాలక్రిష్ణలు వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారిపై మండిపడింది. వారిద్దరి క్షమాపణల్ని తాము అంగీకరించలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు.
అంతేకాదు.. ఈ కేసులో తాము తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ సుప్రీం చేసిన హెచ్చరిక ఇప్పుడు పతంజలి సంస్థకు షాకింగ్ గా మారింది. అంతేకాదు.. ఈ కేసులో సదరు సంస్థ మీద చర్యలు తీసుకోకుండా తాత్సారం చేశారంటూ ఉత్తరాఖండ్ అధికారులపైనా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రాల్ని అటు.. ఇటు పంపుతూ ఎలాంటి చర్యలకు అవకాశం లేకుండా నాలుగైదేళ్లుగా కేసును జాప్యంపైనా సుప్రీం ఫైర్ అయ్యింది.
పతంజలి సంస్థకు లైసెన్స్ ఇచ్చే విషయంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అధారిటీ అధికారుల నిర్లక్ష్యంపైనా సుప్రీం ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. వారిపై చర్యలు ఖాయమన్న స్పష్టమైన సంకేతాల్ని ఇవ్వటం గమనార్హం. షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని.. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. తాజాగా పరిణామాల్ని చూస్తే.. రానున్న రోజుల్లో ఈ కేసులో పతంజలి సంస్థకు భారీ ఎదురుదెబ్బ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.