పోస్టల్ బ్యాలెట్ పై జోక్యం చేసుకోం: సుప్రీం కోర్టు... వైసీపీకి షాక్
గత నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు... రాష్ట్రంలో ఉద్యోగులు, వృద్ధులు, వికలాంగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించి ఓటేశారు
By: Tupaki Desk | 3 Jun 2024 1:43 PM GMTఏపీలో గత నెల 13న జరిగిన పోలింగ్‌కు సంబంధించి మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీకి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించే విషయంలో తాము జోక్యం చేసుకోబోమని... పైగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ తాము వేలు పెట్టబోమని సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో ఇటీవల కాలంలో వివాదంగా ఉన్నాయంటూ.. వైసీపీ లెవనెత్తిన.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ తాజా ఉత్తర్వులు యథాతథంగా కొనసాగనున్నాయి.
ఏం జరిగింది?
గత నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు... రాష్ట్రంలో ఉద్యోగులు, వృద్ధులు, వికలాంగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించి ఓటేశారు. వీరిలో ఉద్యోగుల విషయంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వీరు ఓటు వేసేప్పుడు.. ``ఈయన ప్రభుత్వ ఉద్యోగే. ఫలానా డిజిగ్నేషన్. ఫలానా విభాగంలో పని చేస్తాడు. కాబట్టిఓటు వేస్తున్నాడు`` అని రాసి ఉన్న 13(ఏ) ఫాంలో సంబంధిత అధికారి ఒకరు సంతకం చేస్తారు. అనంతరం.. ఉద్యోగి తన ఓటును వేస్తాడు.
అయితే..ఇ క్కడే వివాదం రేగింది. సదరు ఉద్యోగిని అటెస్ట్(నిర్ధారిస్తూ) చేస్తూ.. సంతకం చేసే అధికారి తన సంతకం కింద పూర్తి పేరును.. ఆయన డిసిగ్నేషన్‌తో కూడిన స్టాంపు(సీలు)ను వేయాలి. కానీ, ఇప్పుడు వాటి అవసరం లేదని.. కేవలం సంతకం ఉంటే సరిపోతుందని ఎన్నికల సంగం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని వైసీపీ తప్పుబడుతూ.. హైకోర్టుకు వెళ్లింది. పాత నిబంధనలే కొనసాగించాలని.. తాజాగా మే 30న ఇచ్చిన ఉత్తర్వులు నిలుపుదలచేయాలని కోరింది. కానీ, హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టి వేసింది.
దీంతో వైసీపీ నేరుగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్.ఎల్.పి) వేసింది. దీనిని సోమవారం విచా రించిన సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. పిటిషన్ ను తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, పిటిషనర్‌కు ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్వేచ్ఛనిచ్చింది. ఈ పరిణామంతో ఎన్నికల కౌంటింగ్ వేళ.. వైసీపీ పెట్టుకున్న ఆశలు.. ఆవిరయ్యాయి.