Begin typing your search above and press return to search.

ఏపీ ఫైబర్ నెట్ కేసు... సుప్రీం కీలక ఆదేశాలు!

ఇందులో భాగంగా కేసుకు సంబంధించిన విషయాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు చంద్రబాబులను ధర్మాసనం ఆదేశించింది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 10:49 AM GMT
ఏపీ ఫైబర్  నెట్  కేసు... సుప్రీం కీలక ఆదేశాలు!
X

గతకొంతకాలంగా ఏపీలో కీలక కేసుల వ్యవహారాలు చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు సుమారు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం మధ్యతర బెయిల్, తర్వాత రెగ్యులర్ బెయిల్ పొందారు. ఈ సమయంలో మరో కీలకమైన ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నేడు సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న ఫైబర్ నెట్ స్కాంకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పిటిషన్ పై తాజాగా సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. ఈ రోజు ఆయనతో పాటు ఏపీ ప్రభుత్వానికీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగా కేసుకు సంబంధించిన విషయాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు చంద్రబాబులను ధర్మాసనం ఆదేశించింది. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సూచించింది. ఇదే సమయంలో బెయిల్‌ పిటిషన్‌ పై విచారణను జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని ఇరుపక్షాలకూ సూచించింది.

ఇందులో ప్రధానంగా... ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడుతున్నారంటూ సీఐడీ అభ్యంతరం తెలిపింది! ఇదే సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తనను జైలుకు పంపిన అంశంపైనా ఆయన బయట మాట్లాడుతున్నట్లు ప్రభుత్వ లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ కేసుపై బహిరంగంగా మాట్లాడకుండా ఆంక్షలు విధించాలని సీఐడీ తరుపు న్యాయవాదులు కోరారు.

అనంతరం చంద్రబాబు తరుపున వాదనలు వినిస్తున్న సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా... ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అదనపు ఏజీ పొన్నవోలుతో పాటు సీఐడీ ఛీఫ్ సంజయ్ కూడా ఢిల్లీ వరకూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు... సంయమనం పాటించాలని ఇరు పక్షాలనూ ఆదేశించింది.

ఇందులో భాగంగా... కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు చంద్రబాబుని ఆదేశించింది. ఇదే సమయంలో స్కిల్ స్కాం కేసులో 17ఏ క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడిన అనంతరం ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని తెలిపిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ కేసును జనవరి 17కు వాయిదా వేసింది.