Begin typing your search above and press return to search.

ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు... తెరపైకి క్విడ్ ప్రోకో!

అవును... రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   2 Nov 2023 12:10 PM GMT
ఎలక్టోరల్  బాండ్స్  పై సుప్రీం కీలక వ్యాఖ్యలు... తెరపైకి క్విడ్  ప్రోకో!
X

రాజకీయ పార్టీల విరాళాల సేకరణ విషయంలో ఎప్పటినుంచో వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు నూతన విధానంలో విరాళాలు స్వీకరిస్తున్నాయి. దీనినే ఎలక్టోరల్ బాండ్స్ అని అంటారు. ఈ క్రమంలో... లోక్‌ సభ ఎన్నికలకు ముందు ఈ అంశంపై మరోసారి దుమారం చెలరేగింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. ఈ సమయంలో సుప్రీం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... పథకం వివరాలు కొందరికే అందుబాటులో ఉండటంపై ప్రశ్నలు లేవనెత్తింది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా దాతలు అందించే విరాళాలకు సంబంధించిన వివరాలు సాధారణ ప్రజలకు అందుబాటులో లేవని, అయితే బాండ్లు జారీ చేసే అధీకృత బ్యాంకు ఎస్బీఐ, దర్యాప్తు సంస్థలు మాత్రం ఈ వివరాలు పొందే వీలుందని పేర్కొంది.

ఇదే సమయంలో... రాజకీయ పార్టీలకు డబ్బులు అందించడం ద్వారా ఇది ముడుపులకు చట్టబద్ధత కల్పిస్తుందని సుప్రీం స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని భావిస్తే మాత్రం... విరాళాలన్నీ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని సంచలన సూచన చేసింది. ఫలితంగా... వాటిని ఈసీ రాజకీయ పార్టీలకు సమానంగా పంచుతుందని తెలిపింది. అలాకానిపక్షంలో... ఈ పథకం ప్రభుత్వం, దాతల మధ్య క్విడ్ ప్రోకోకు అవకాశం కల్పిస్తుందని వ్యాఖ్యానించింది!

ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పథకం ప్రభుత్వం, దాతల మధ్య క్విడ్ ప్రోకోకు అవకాశం కల్పిస్తుందని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో... సుప్రీం ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.

కాగా... ఎలక్టోరల్ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుందనేది తెలిసిన విషయమే. వీటిలో అతి తక్కువ విలువ కలిగిన బాండ్ రూ. 1,000 కాగా.. కోటి రూపాయలది అత్యధిక విలువ కలిగిన బాండ్‌. అయితే... ఈ బాండ్ల కొనుగోలు సంఖ్యపై పరిమితి లేదు.

విరాళాలను స్వీకరించే అర్హతలేని రాజకీయ పార్టీలు:

ఎలక్టోరల్ బాండ్ల విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో... ఎన్నికల విరాళాలను స్వీకరించే అర్హతలేని రాజకీయ పార్టీలు ఏవి అనే ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. దీనికి సమాధానం ఇప్పుడు చూద్దాం! ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవచ్చు. ఇంతే కాకుండా లోక్‌ సభ లేదా అసెంబ్లీ ఎన్నికలలో.. ఎన్నికల విరాళాలు స్వీకరించే పార్టీ ఓట్ షేర్ కనీసం ఒక శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.