Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నెత్తిన కొండా బండ

నిజానికి అప్పటికి ఆమెకి మంత్రి పదవి దక్కి కొద్ది నెలలు మాత్రమే అయింది.

By:  Tupaki Desk   |   3 Oct 2024 3:30 PM GMT
కాంగ్రెస్ నెత్తిన కొండా బండ
X

ఆమె కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్. ఆమె వైఎస్సార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె వైఎస్సార్ టైం 2009లో మొదటి సారి మంత్రి అయ్యారు. ఆయన మరణం తరువాత జగన్ వైపు వచ్చారు. ఆ టైం లో ఆమె అప్పటి కాంగ్రెస్ సీఎం రోశయ్యనే ధిక్కరించిన సందర్భాన్ని అంతా చూసారు. అంతే కాదు జగన్ కోసం ఆమె తన మంత్రి పదవిని తృణ ప్రాయంగా త్యజించారు. నిజానికి అప్పటికి ఆమెకి మంత్రి పదవి దక్కి కొద్ది నెలలు మాత్రమే అయింది.

అయినా వైఎస్సార్ కుటుంబం పట్ల ఆమె చూపించిన విధేయత ముందు మంత్రి పదవి లెక్కలోకి రాలేదు. జగన్ తో ఆమె అలా కొన్నేళ్ల పాటు ప్రయాణించారు. ఇక విభజన తరువాత తెలంగాణాలో ఆమె చాలా పార్టీలు మారారు. అయినా రాజయోగం మంత్రి యోగం పట్టలేదు ఎట్టకేలకు ఇపుడు మంత్రి అయ్యారు.

కేవలం పది నెలల పదవిని మాత్రమే ఆమె అనుభవించారు. ఇంకా చాలా కాలపరిమితి చేతిలో ఉంది. ఇంతలోనే ఆమె అతి పెద్ద వివాదంలో పడ్డారు. తాను మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా ఆమె పూర్తిగా ఇబ్బందుల్లో నెట్టేశారు. అలా ఆమె చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నెత్తిన అతి పెద్ద బండ వేశారు అని అంటున్నారు.

ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్ధి కేటీఆర్ ని బదనాం చేయడానికే అయినా వాటి వెనక బాధితులు వేరే వారు ఉన్నారు. ఇపుడు టోటల్ టాలీవుడ్ నే కన్నెర్ర చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తం పరిణామాలను ఆమె అసలు ఊహించి ఉండరు. ఒక మహిళ అయి ఉండి బాధ్యతతో కూడిన పదవిలో ఉన్న కొండా సురేఖ ఇపుడు పూర్తిగా చిక్కుల్లో పడిపోయారు.

ఆమె తాను అంటున్నది చేస్తున్నది ఆరోపణలు. అవి రేపటి రోజున కోర్టు ముందుకు వెళ్ళినపుడు నిరూపించాల్సి ఉంటుంది. గాలి మాటలు కావు అని చెప్పాల్సి ఉంటుంది. బయట చూస్తే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతారు. కానీ ఆధారాలు వేటికీ ఉండవు, ఇపుడు కొండా సురేఖ మీద సినీ నటుడు అక్కినేని నగార్జున న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారు. అయన పరువు నష్టం దావాని నాంపల్లి కోర్టులో వేశారు.

దాంతో కొండా సురేఖ పూర్తిగా ఇరుకున పడిపోయారు అనే అంటున్నారు. ఆమె కోర్టు ముందుకు వెళ్ళి ఆధారాలు లేని ఆరోపణలు చేశారు అని కనుక బయటకు వస్తే అపుడు ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా బిగ్ ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయి. ఒక వైపు చూస్తే కాంగ్రెస్ గతానికి భిన్నంగా ఎంతో కొంత ఐక్యత ప్రదర్శిస్తున్నా అదంతా ఒక టైం వరకే అని అంటున్నారు.

మూసీ నది పరివాహక ప్రాంతంలో కూల్చివేతల విషయంలో సీనియర్ నేత మధు యాష్కి ప్రభుత్వంతో విభేదిస్తున్నారు. ఆయన పేదలకు ఏమైనా జరిగితే ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నిస్తాను అని అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే చాలా మంది సీనియర్లు హైడ్రా ఇష్యూలో భిన్నంగా స్పందిస్తున్నారు. నిజానికి ఇలాంటి ఆక్రమణల విషయంలో కూల్చివేతలు వంటి కఠిన నిర్ణయాల విషయంలో సొంత పార్టీల నుంచే మద్దతు తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే అందరూ అందరే కాబట్టి అని అంటున్నారు.

ఇక రేవంత్ రెడ్డి పది నెలల పాలన పూర్తి అయింది. ఆయన వరకూ బాగానే ఉంటున్నా సమస్యలు అసలైనవి ఇపుడే మొదలయ్యాయి అంటున్నారు. టాలీవుడ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎపుడూ సానుకూలంగా ఉంటూనే వచ్చాయి. అయితే ఇపుడు మాత్రం ఇలాంటి ఆరోపణల వల్ల గ్యాప్ పెరుతుంది అని అంటున్నారు.

మంత్రి సురేఖ చేసిన దాని మీద ఇండస్ట్రీ పెద్దలు అయితే గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో పౌర సమాజం కూడా ఆగ్రహంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖ ఇష్యూ అంత తేలికగా క్లోజ్ అవుతుందా అన్నదే చర్చగా ఉంది. ఈ విషయంలో ఆమె మీద యాక్షన్ ని డిమాండ్ వస్తోంది. మరి ఆమె ఫైర్ బ్రాండ్ ఆమెను ఉంచినా లేక తప్పించినా చిక్కులు తప్పవని కూడా అంటున్నారు. మొత్తానికి కొండా సురేఖ బండ విపక్షం బీఆర్ఎస్ మీద పడలేదు, సొంత పార్టీ మీదనే పడింది అని అంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఏ రకమైన తీరుతో ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది.