Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రిగా ఒకే ఒక్కడు

ఇది అన్నింటి కంటే మహదానందం కలిగించే విషయంగా కమలానికి ఉంటుంది అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 3:45 AM GMT
కేంద్ర మంత్రిగా ఒకే ఒక్కడు
X

బీజేపీకి ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం 29 ఎంపీలు దక్కాయి. కర్నాటకలో 17, తెలంగాణాలో ఎనిమిది, ఏపీలో మూడు దక్కితే అనూహ్యంగా కేరళ నుంచి ఒక ఎంపీని ఆ పార్టీ గెలుచుకుంది. ఇది అన్నింటి కంటే మహదానందం కలిగించే విషయంగా కమలానికి ఉంటుంది అనడంలో సందేహం లేదు.

లెఫ్ట్ భావజాలం ఎక్కువగా ఉన్న కేరళలో బీజేపీ ప్రతీ ఎన్నికలోనూ దండయాత్ర చేస్తోంది కానీ ఫలితం దక్కడం లేదు. దాంతో ఈసారి కొత్త ప్రయోగం చేసింది. కేరళలో ఒకనాటి సూపర్ స్టార్ అయిన సురేష్ గోపీని బీజేపీ తరఫున నిలబెట్టింది

త్రిస్సూర్ లోక్ సభ సీటు నుంచి సురేష్ గోపీని గెలిపిస్తే కనుక కేంద్ర మంత్రిని చేస్తామని మోడీ బంపర్ ఆఫర్ ని అక్కడ ప్రజలకు ఇచ్చారు. అలా సురేష్ గోపీ సినీ గ్లామర్ బీజేపీ క్యాడర్ కష్టం మోడీ హామీ అన్నీ కలసి వచ్చి బీజేపీకి ఈ సీటు దక్కింది.

ఈ సీటు విషయం చూస్తే కామ్రేడ్స్ కి కంచుకోట. 1957 నుంచి ఇప్పటిదాకా ఈ సీటులో కామ్రేడ్స్ పది సార్లు గెలిచారు. కొన్ని సార్లు అయితే వరసబెట్టి నాలుగు పర్యాయాలు విజయ ఢంకా మోగించారు. ఇక కాంగ్రెస్ ఇక్కడ నుంచి ఏడు సార్లు గెలిచింది. ఇలా ఈ సీటు కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్యనే కేంద్రీకృతం అయి ఉన్న వేళ బీజేపీ ఈ కోటను బద్ధలు కొట్టింది.

తాజా ఎన్నికల్లో సురేష్ గోపీ దాదాపుగా 75 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ కమ్యూనిస్టు అభ్యర్ధులు ఇద్దరినీ ఓడించారు. అయితే సురేష్ గోపీకి ఈ విజయం అంత తేలిగ్గా దక్కలెదు. ఆయన 2019లో కూడా పోటీ చేశారు. ఆనాడు 293,822 ఓట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ నాడు గెలిచింది. కమ్యూనిస్టులు రెండవ ప్లేస్ లో ఉంటే మూడవ స్థానంలో బీజేపీ ఉంది. అలా అయిదేళ్ల పాటు పనిచేసిన మీదట జనంలో వచ్చిన సానుభూతి కూడా తోడు అయి సురేష్ గోపీ ఎంపీ అయ్యారు.

దాంతో ఆయనను మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సురేష్ గోపీకి ఏ శాఖ ఇస్తారో చూడాలి. ఈ దెబ్బతో కేరళలోని 20 ఎంపీ సీట్లను గెలిచినంతగా బీజేపీ సంబరం చేస్తోంది. సురేష్ గోపీ కేరళలో కమల వికాసానికి ఏ మేరకు కృషి చేస్తారో చూడాలి. రానున్న కాలంలో అంటే 2026లో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 140 అసెంబ్లీ సీట్లలో ఎన్నో కొన్ని గెలుచుకోవాలనే బీజేపీ ఈ మంత్రి పదవిని సురేష్ గోపీకి కట్టబెట్టింది అని అంటున్నారు.