సరోగసీతో మరో బెనిఫిట్.. కేంద్రం ఏం చెప్పిందంటే!
సరోగసీ.. సాధారణ రీతిలో గర్భం దాల్చలేని స్థితిలో ఉన్న దంపతులకు... ఇప్పుడు ఇది వరంగా మారింది
By: Tupaki Desk | 25 Jun 2024 12:30 AM GMTసరోగసీ.. సాధారణ రీతిలో గర్భం దాల్చలేని స్థితిలో ఉన్న దంపతులకు... ఇప్పుడు ఇది వరంగా మారింది. దేశంలో గత ఏడాది 16 వేల మంది సరోగసీ ద్వారా బిడ్డలకు జన్మనిచ్చినట్టు లెక్కలు చెబుతున్నా యి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో వీరు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు కేంద్రం సరోగసీ తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. సరోగసీ ద్వారా తల్లి అయ్యే వారు ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆరు మాసాల పాటు సెలవులు ఇచ్చేందుకు కేంద్రం ఓకే చెప్పింది.
అదేసమయంలో సరోగసీ ద్వారా తండ్రి అయ్యే వ్యక్తికి ఇప్పటి వరకు సెలవులు లేవు. ఇప్పుడు వారికి కూడా 15 రోజులపాటు సెలవులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్లు... వైద్య నిపుణుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్(లీవ్స్)లో సవరణలు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఇప్పటి వరకు.. సాధారణ రీతిలో గర్భం దాల్చి.. బిడ్డలను ప్రసవించిన తల్లులకు మాత్రమే 180 రోజుల సెలవు అవకాశం ఉంది.
కానీ, సరోగసిలో అద్దె గర్భం ఇచ్చిన తల్లి.. కేవలం ప్రసవం వరకే పరిమితం అవుతున్న నేపథ్యంలో పుట్టిన బిడ్డ ఆలనా పాలనా కూడా.. సరోగసీ తల్లి చూడాల్సి వస్తోంది. దీంతో చాలా మంది ఉద్యోగులు సెలవులు పెడుతున్నారు. దీంతో ఆఫీసు వాతావరణంలోనూ మార్పు వస్తోంది. ఇక, ఉద్యోగులు కూడా.. దీనిపై ఆలోచించాలని సర్కారుకు మొర పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యానికి తోడు.. సరోగసి మహిళలు ఒత్తిడికి గురవుతున్నట్టు వైద్యులు కూడా నివేదికలు ఇచ్చారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది.