Begin typing your search above and press return to search.

ఇంటర్నెట్ లెక్కలు... వాడకం అంటే ఏమిటో చూపిస్తున్న మన యువత!

ఈ విషయంలో దేశ సగటును మించి ఇంటర్నెట్ ని వినియోగిస్తూ.. వాడకం అంటే ఏమిటో చూపిస్తున్నారంట ఏపీ యువత!

By:  Tupaki Desk   |   12 Oct 2024 2:45 AM GMT
ఇంటర్నెట్  లెక్కలు... వాడకం అంటే ఏమిటో చూపిస్తున్న మన యువత!
X

ఇంటర్నెట్ అనేది ఈ రోజుల్లో అత్యంత అవసరం. ఓ మనిషికి అత్యంత అవసరమైన గాలి, నీరు, ఆహారం, దుస్తులు, నివాసం ఎంత ముఖ్యమో.. వాటితో పాటు ఇంటర్నెట్ కూడా దాదాపుగా అంతే ముఖ్యమైన రోజులివి. ఈ విషయంలో దేశ సగటును మించి ఇంటర్నెట్ ని వినియోగిస్తూ.. వాడకం అంటే ఏమిటో చూపిస్తున్నారంట ఏపీ యువత!

అవును... ఏపీలో యువత దేశ సగటును మించి ఇంటర్నెట్ వినియోగిస్తోందని.. ప్రధానంగా ఏపీలోని పట్టణ యువతలో 93.7 శాతం మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారని.. ఇదే సమయంలో ఏపీలో పురుషులు, స్త్రీలు కూడా దేశ సగటును మించి రాష్ట్రంలో ఇంటర్నెట్ వాడుతున్నారని తాజా సర్వేలో వెల్లడైనట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

జూలై 2022 నుంచి జూన్ 2023 వరకూ నిర్వహించిన సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు కేంద్రం ప్రకటించింది. ఇక వయసుల వారీగా ఈ వినియోగం ఎలా ఉందని చూస్తే... అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా 15 - 24 సంవత్సరాల మధ్య ఉన్న యువతీ, యువకులు.. దేశ సగటును మించి ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నట్లు తేలిందంట.

ఈ వయసులో ఉన్న యువతీ యువకులు దేశంలో సగటున 84.8 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా.. ఏపీలో మాత్రం 91.1 శాతం మంది ఇంటర్నెట్ ను వాడుతున్నారని తేలిందని చెబుతున్నారు. ఇదే కేటగిరిలో ఇంటర్నెట్ వాడే పురుషులు (యువకులు) దేశంలో సగటున 89.1 శాతం మంది ఇంటర్నెట్ వాడుతుండగా.. ఏపీలో వారి లెక్క 94.6 శాతంగా ఉందని చెబుతున్నారు.

ఇక ఇదే కేటగిరీలో దేశంలో సగటున మహిళలు (యువతులు) 80 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 87.3 శాతం మంది మహిళలు ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు తేలిందని చెబుతున్నారు. ఇలా ఈ కేటగిరిలో ఇంటర్నెట్ వినియోగంలో ఏపీ టాప్ లో ఉండగా... ఉత్తరప్రదేశ్ 75.6 శాతంతో చివరి స్థానంలో నిలిచింది!