సర్వే సంస్థలు భయపడుతున్నాయా? తెరవెనుక విషయం ఏంటి?
వైసీపీ ఒకవైపు.. టీడీపీ-బీజేపీ-కూటమి పక్షాలు మరోవైపు.. హోరా హోరీ పోరాడుకున్నాయి.
By: Tupaki Desk | 23 May 2024 3:30 PM GMTసర్వే సంస్థలు భయపడుతున్నాయా? గతంలో మాదిరిగా ఇప్పుడు డేర్ చేసి.. తమ ఫలితం వెల్లడించలే ని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీ సహా.. వివిధ రాష్ట్రాల్లో 5 దశల పోలింగ్ ముగిసిపోయింది. వీటిలో పలు ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. మరో రెండు దశలు మిగిలి ఉన్నాయి. అయితే.. ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రాల్లో అందరినీ ఉత్కంఠకు గురి చేస్తున్న రాష్ట్రం ఏపీ. మరీ ముఖ్యంగా ఇక్కడి అసెంబ్లీ ఎన్నికలు.
వైసీపీ ఒకవైపు.. టీడీపీ-బీజేపీ-కూటమి పక్షాలు మరోవైపు.. హోరా హోరీ పోరాడుకున్నాయి. మాటల తూ టాలు.. విమర్శలు సంధించుకున్నాయి. కన్నీళ్లు కూడా పెట్టుకున్న నాయకులు ఉన్నారు. సెంటిమెంటు ను కూడా రాజేసిన పార్టీలు కూడా ఉన్నాయి. అయితే.. ఇంత జరిగిన.. ఏపీపై ఆది నుంచి ఎంతో ఇంట్రస్ట్ చూపించిన అనేక సర్వే సంస్థలు.. పోలింగ్ ముగిసిన తర్వాత.. మాత్రం మౌనంగా ఉన్నాయి. ఎటూ ఏమీ చెప్పలేక పోతున్నాయి. అయితే.. ఇక్కడ ఒక సందేహం వస్తుంది.
ప్రస్తుతం ఎన్నికల కోడ్, నిబంధనలు కూడా అడ్డుగా ఉన్నాయి కాబట్టి సర్వే సంస్థలు జంకుతున్నాయని అనుకోవచ్చు. కానీ, తెలంగాణ ఎన్నికల వేళ కూడా.. నిబంధనలు ఉన్నా.. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో కాకుండా.. అధ్యయనం, అంచనాలు అంటూ.. పేరు మార్చి వెల్లడించాయి అలానే.. గత ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇలానే వ్యవహరించాయి. కాబట్టి కోడ్, నిబంధనలకు సర్వే సంస్థలు భయపడడం కన్నా.. రాజకీయంగా సంస్థలు భయపడుతున్నాయనే చర్చ సాగుతోంది.
ఇతర రాష్ట్రాలకు, ఏపీకి మధ్య భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. వ్యక్తిగత కక్షలు.. రాజకీయ దాడులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఏపీ పేరు తెచ్చుకుంది. దీంతో సర్వే సంస్థలు కూడా.. రేపు ఏదైనా తేడా కొడితే.. తమపై కక్షకడతారేమో.. అనే భావనతో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇది తమ ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితి ఉంటుందని కూడా.. చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, ఏపీ కేంద్రంగా చేసుకుని సాగించే సర్వే సంస్థలు నోరు విప్పక పోవడం వెనుక రాజకీయ పరమైన కారణాలు ఉండి ఉంటాయని.. విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.