మూడు సర్వేల ముచ్చట... ఏపీలో తేల్చింది ఏంటంటే!
ఏపీలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు.. పొరుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 9 Jan 2024 11:40 AM GMTఏపీలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు.. పొరుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. మరోసారి అధికారం దక్కించుకునేందుకు వైసీపీ, గత ఎన్నికల్లో ఎదురైన ఓటమిని ఇప్పుడు తిరగరాసి.. విజయం దక్కించుకునేందుకు టీడీపీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. ఒకవైపు ఎన్నికల వ్యూహాలు.. మరోవైపు.. అభ్యర్థుల ఎంపికలో ఇరు పార్టీలూ తీవ్రస్థాయిలో ముందుకు దూసుకుపోతున్నా యి. ఈ విషయంలో టీడీపీ తనకు కలిసి వచ్చే పార్టీలతో చేతులు కలిపి.. ఎన్నికల్లో దిగాలని నిర్ణయించుకుంది.
ఇక, వైసీపీకి కలిసి వచ్చే పార్టీలకన్నా.. ప్రజలనే నమ్ముకున్నామని చెబుతున్న నేపథ్యంలో నేరుగానే ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడనుంది. ఇప్పటి వరకు వైసీపీ ఏపార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండానే పోటీ చేసిం ది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుంది? ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది? అనేది రెం డు మాసాల ముందే ఆసక్తిగా మారింది. దీనిపై ఇప్పటికే మూడు సర్వేలు ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? అనే విషయంపై దృష్టి పెట్టాయి.
కొన్ని రోజుల కిందట `జన్‌మాట` సర్వే ఒక రిపోర్టును విడుదల చేసింది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 116-120 స్థానాల్లో విజయం దక్కుతుందని తేల్చి చెప్పింది. ఇదేసమయంలో టీడీపీ-జనసేన కూటమికి 62 - 64 స్థానాలు దక్కుతాయని.. ఇతరులకు 2-4 స్థానాల్లో విజయం దక్కించుకునే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చి చెప్పింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 15000 మంది ప్రజల నుంచి సమాచారం సేకరించినట్టు ఈ సర్వే స్పష్టం చేసింది.
తాజాగా వచ్చిన మరో సర్వే.. `రా`. ఈ సంస్థ కూడా డిసెంబరు 2 వతేదీ నాటికి సుమారు 50 వేల మందిని కలిసి వారి నాడిని పట్టుకున్నట్టు చెప్పింది. దీని ప్రకారం.. వైసీపీనే తిరిగి మరోసారి అధికారంలోకి వస్తుందని రా కూడా తేల్చి చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 115-122 స్థానాలు, జనసేన-టీడీపీ కూటమికి 62-66 స్థానాల్లో విజయం దక్కుతుందని పేర్కొంది. ఇతరులకు 2-4 స్థానాల్లో విజయం దక్కుతుందని తెలిపింది.
ఇక, ఈ మధ్య కాలంలో వచ్చిన మరో సర్వే.. `చాణక్య` . ఇది మాత్రం టీడీపీ-జనసేన కూటమికి పట్టం కట్టింది. సుమారు 20 వేల మందితో నిర్వహించిన సర్వేలో.. టీడీపీ-జనసేన కూటమికి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పంది. 125-135 స్థానాల్లో ఈ కూటమి విజయం దక్కించుకుంటుందని పేర్కొంది. వైసీపీకి కేవలం 43-52 స్థానాల్లో మాత్రమే గెలుపు గుర్రం ఎక్కేందుకు అవకాశం ఉందని తెలిపింది. అయితే.. ఈ మూడు సర్వేల్లో రెండు వైసీపీకి అనుకూలంగా ఉండడం గమనార్హం.