కాంగ్రెస్‌కు సర్వే షాక్.. కంటోన్మెంట్, మల్కాజిగిరిలో పోటీకి సై
పార్టీలోని అసంతృప్తులను బుజ్జగిస్తున్న రేవంత్‌కు.. సర్వే తీరు షాక్ కలిగించిందనే చెప్పాలి.
By: Tupaki Desk | 25 April 2024 11:23 AM GMTలోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో దూకుడుమీదున్న కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణ షాకిచ్చారు. రెబల్‌గా మారి పార్టీనే దెబ్బ కొట్టేందుకు సిద్ధమయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్ కూడా వేశారు. మల్కాజిగిరి ఎంపీగానూ పోటీ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఓ వైపు బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటూ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచే లక్ష్యంతో సాగుతున్న కాంగ్రెస్‌కు ఇది దెబ్బే! పార్టీలోని అసంతృప్తులను బుజ్జగిస్తున్న రేవంత్‌కు.. సర్వే తీరు షాక్ కలిగించిందనే చెప్పాలి.
1985లో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి సర్వే సత్యనారాయణ విజయం సాధించారు. అనంతరం సిద్ధిపేట నుంచి ఒకసారి, మల్కాజిగిరి నుంచి మరోసారి ఎంపీగా గెలుపొందారు. కేంద్రమంత్రిగానూ పని చేశారు. అలాంటి సీనియర్ నేత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్‌ను సర్వే ఆశించారు. కానీ కొన్నేళ్లుగా ఆయన పార్టీలో చురుగ్గా లేరన్న కారణంతో పార్టీ పక్కనపెట్టింది. బీజేపీ నుంచి వచ్చిన శ్రీగణేష్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో సర్వే సత్యనారాయణ తిరుగుబాటు ఎగరవేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగానే నామినేషన్ వేశారు. కానీ పార్టీ నుంచి బీఫాం అందే అవకాశం లేదు కాబట్టి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడే అవకాశముంది.
ఇక మల్కాజిగిరి ఎంపీగానూ పోటీ చేస్తానన్నారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ను ఉద్దేశించి సర్వే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్నది రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాదని, తెలుగుదేశం కాంగ్రెస్ అని విమర్శించారు. గెలుపు గుర్రాలకు కాకుండా కుంటి గుర్రాలకు రేవంత్ రెడ్డి టికెట్‌లు ఇస్తున్నారని సర్వే మండిపడ్డారు. రెండు సార్లు ఎంపీగా గెలుపొంది కేంద్రమంత్రిగా చేసిన చేసిన తాను ఎమ్మెల్యేగా పోటీకి పనికిరానా అని ప్రశ్నించారు. బీజేపీ నుంచి ఓడిపోయిన శ్రీగణేష్‌ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వడం సమంజసం కాదన్నారు. తనకు బీఫాం ఇవ్వకుంటే కంటోన్మెంట్, మల్కాజిగిరిలో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి, తడాఖా చూపిస్తానని హెచ్చరించారు.