షాకింగ్: 'నన్ను దొరికితే చంపేయాలని సజ్జల ఆదేశించారు'
గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించి.. అన్ని తానై నడిపిన సజ్జల రామక్రిష్ణారెడ్డి మీద సంచలన ఆరోపణ చేశారు.
By: Tupaki Desk | 24 Jun 2024 5:02 AM GMTసంచలన అంశాన్ని వెల్లడించారు రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కేసీఆర్ సూర్యనారాయణ. గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించి.. అన్ని తానై నడిపిన సజ్జల రామక్రిష్ణారెడ్డి మీద సంచలన ఆరోపణ చేశారు. తాను దొరికితే వెంటనే చంపేయాలని సజ్జల రామక్రిష్ణారెడ్డి పోలీసుల్ని ఆదేశించారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వ అరాచకాల్ని చంద్రబాబు వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినందుకు తనపై కక్ష కట్టినట్లుగా పేర్కొన్నారు.
ఒక దినపత్రికలో తనపై వచ్చిన ఒక చిన్న నిరాధార వార్తను పట్టుకొని అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి కక్షపూరితంగా తనపై చర్యలకు సిద్ధమయ్యారని.. మరి ఆయన అవినీతిపై ఇప్పుడు బోలెడన్ని వార్తలు వస్తున్నాయని.. మరి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు. పోలీసుల విచారణ పేరుతో తన భార్య మెడలోని నల్లపూసల తాడును తీసివేయించారన్న ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. గత ప్రభుత్వం చేపట్టిన అరాచకాల్లో నిజాలు నిగ్గు తేల్చేలా హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి నేత్రత్వంలో జ్యూడిషియల్ రివ్యూ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు.
అప్పటి విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కలిసి ప్రభుత్వంలోని లోపాల్ని వారికి వివరించే ప్రయత్నం చేసిన సందర్భంలో తనకు ఎదురైన పరిస్థితుల గురించి వివరించిన సూర్యనారాయణ.. ''నేను చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు విషయాలు చెప్పేందుకు సిద్ధమవుతున్న విషయాన్ని అప్పటి నిఘా విభాగానికి అధిపతి అయిన పీఎస్ఆర్ ఆంజనేయులకు తెలిసింది. వెంటనే నా వద్దకు పోలీసులు వచ్చారు. యేసుబాబు అనే పోలీసు అధికారి నన్ను బెదిరించాడు.
ప్రతిపక్ష నేతల్ని కలిసే ప్రయత్నం విరమించుకోకుంటే అంతు చూస్తామని బెదిరించాడు. తర్వాతి రోజు ఫోన్ చేసి.. ఉదయం ఎనిమిదిన్నర గంటల లోపు సజ్జల వద్దకువెళ్లి క్షమాపణలు చెప్పాలి. కోర్టులో వేసిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. లేదంటే మధ్యాహ్నాం 2.30 గంటల తర్వాత యూ ఆర్ నో మోర్. నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు'' అంటూ బెదిరింపులకు దిగారన్నారు.
తనకు ఎదురైన అన్ని పరిస్థితుల్ని అప్పట్లో చంద్రబాబుకు వివరించానని.. ఆ విషయం తెలుసుకొని నా ింటి వద్ద 200 మంది పోలీసుల్ని మొహరించారన్నారు. తన ఆచూకీ గురించి చెప్పాలంటూ తన డ్రైవర్ ను విజయవాడలోని నాలుగు స్టేషన్లలో తిప్పి.. దాడి చేశారన్నారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదైన కారణంగా విధుల నుంచి తొలగించిన అసమర్థ ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్.. ''ఇప్పటికి ఏడాదిన్నర గడిచింది. ఏ కారణంతో నన్ను సస్పెండ్ చేశారో ఇప్పటివరకు మెమో ఇవ్వలేదు. నా ఫోన్లను ట్యాప్ చేశారు. నన్ను నానా ఇబ్బందులకు గురి చేశారు'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.