Begin typing your search above and press return to search.

అఖిల ప్రియ సంస్కారంపై మేనమామ ఘాటు వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి ఫైరయ్యారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ వ్యవహారశైలిని పూర్తిగా తప్పుపట్టిన ఆయన.. ఆమె సంస్కారం లేదంటూ కామెంట్స్ చేశారు!

By:  Tupaki Desk   |   16 Oct 2024 2:05 PM GMT
అఖిల ప్రియ సంస్కారంపై మేనమామ ఘాటు వ్యాఖ్యలు!
X

టీడీపీలో చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చే నేతల జాబితాలో అఖిల ప్రియ ముందు వరుసలో ఉంటారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఇప్పటికే చంద్రబాబుతో పలుమార్లు హెచ్చరికలు తీసుకున్నట్లు చెబుతున్న అఖిల ప్రియ.. తాజాగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ జగన్ మోహన్ రెడ్డితో కయ్యానికి కాలుదువ్వారు.

తాజాగా కర్నూలు లోని డెయిరీ కార్యాలయానికి వెళ్లిన భూమా అఖిల ప్రియ.. నేరుగా ఆయన సీట్లోనే కూర్చున్నారు. వాస్తవానికి ఇలా చేయడం చాలా తప్పనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి ఫైరయ్యారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ వ్యవహారశైలిని పూర్తిగా తప్పుపట్టిన ఆయన.. ఆమె సంస్కారం లేదంటూ కామెంట్స్ చేశారు!

అవును... తాను లేనప్పుడు తన కార్యాలయంలో తన కుర్చీలో కూర్చుని సమీక్షలు చేయడంపై ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తన మేడకోడలు, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఏమాత్రం సంస్కారం లేదని అన్నారు. తన ఆఫీసులోకి అనుమతి లేకుండా రావడమే కాకుండా.. తన సీట్లో కూర్చోవడం ఆమె విజ్ఞతకే వదిలి పెడుతున్నట్లు తెలిపారు.

ఇక ఆమె కూర్చున్న కుర్చీనే తీసివేశానని చెప్పిన ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి... అఖిల ప్రియ చేసింది ముమ్మాటికీ తప్పని అన్నారు. ఈ సందర్భంగా మీ ఇంట్లోకి వచ్చి కుర్చీలో కుర్చుంటే ఎలా ఉంటుంది? అని ఆమెను సూటిగా ప్రశ్నించారు. ఇదే క్రమంలో... విజయడెయిరీ అనేది స్వతంత్ర సంస్థ అని.. దానికి ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇక ఫోటోల విషయానికొస్తే... తన కార్యాలయంలో చంద్రబాబు ఫోటో పెట్టారని, అయితే దాన్ని తీసెయ్యొచ్చని.. కానీ, చంద్రబాబు తమకు సీఎం కాబట్టి గౌరవంగా ఆ ఫోటోని అట్లే ఉంచుతా అని అన్నారు. ఇదే క్రమంలో... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు మాజీ ముఖ్యమంత్రి అని.. తనకు పదవి ఇచ్చిన జగన్ అభిమానాన్ని ఎలా మరిచిపోతానని ఆయన ప్రశ్నించారు!

ఇక తాము వ్యాపారలు చేసుకునేవారమని.. ఇలాంటి ఆందోళనలు అవసరం లేదని.. అఖిల ప్రియకు కేసులు అలవాటయ్యాయని.. కిడ్నాప్ లు, తన్నడాలు ఇలాంటివి ఆమెకు అలవాటే అని.. అయితే అనుమతి లేకుండా తన కార్యాలయానికి వచ్చిన ఆమెపై కేసు పెట్టకూడదని అనుకుంటున్నట్లు చెప్పారు. కేసులతో ఒరిగేదేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కేవలం చంద్రబాబు మెహర్బానీ కోసమే నంద్యాలలో తన ఆఫీసుకు వచ్చి అఖిల ప్రియ హడావిడి చేసిందని విమర్శించిన జగన్ మోహన్ రెడ్డి.. ఆమె గురించి చంద్రబాబుకు అన్నీ తెలుసని.. నాలుగు నెలల్లో ఆమె ఏమేమి చేసిందో చంద్రబాబు దగ్గర చిట్టా ఉందని తెలిపారు. ఇదంతా తన తమ్ముడు జగత్ విఖ్యాత్ కోసం అఖిల చేస్తుందని ఆరోపించారు.

ఇందులో భాగంగా... తనను దించి ఈ విజయ డెయిరీ ఛైర్మన్ పదవి లో తన తమ్ముడిని కుర్చోబెట్టాలని ఆమె ప్రయత్నిస్తున్నారని.. ఇంతా తనకు ఏడాదిన్నర పదవీ కాలం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ విషయం మరిచో ఏమో కానీ.. లేడికి లేచిందే పరుగన్నట్లుగా అఖిల ప్రియ వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఈమె వ్యవహారశైలి వల్ల ప్రశాంతమైన నంద్యాల మరో ఆళ్లగడ్డలా తయారవుతుందని ఈ సందర్భంగా ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.