Begin typing your search above and press return to search.

పిఠాపురం వర్మ కుండబద్ధలు కొట్టేశారా ?

పిఠాపురం పవన్ పరం. అది జనసేన విజయానికి పర్యాయపదం.

By:  Tupaki Desk   |   15 Oct 2024 3:57 AM GMT
పిఠాపురం వర్మ కుండబద్ధలు కొట్టేశారా ?
X

పిఠాపురం పవన్ పరం. అది జనసేన విజయానికి పర్యాయపదం. ఇలా గాజు గ్లాస్ పార్టీ చాలానే పిఠాపురం గురించి చెప్పుకుంటూ మురిసిపోతూ ఉండవచ్చు. ఆ మురిసిపోవడాలు ఒక ఎత్తు అయితే మరో వైపు చూస్తే టీడీపీలో కీలక నేతలు తమ వైభోగం అంతా గత కాలం అని చింతిస్తున్నారు అని అంటున్నారు. పిఠాపురం మాకు గోపురం అని పాడుకున్న పాటలు అన్నీ ఫ్లాష్ బ్యాక్ గీతాలే అని మధనపడుతున్నారుట.

ఇక పిఠాపురం లో టీడీపీకి వర్మ అనే గట్టి నాయకుడు ఉన్నారు. ఆయన పేరులోనే సామాజిక వర్గం సంకేతం ఉంది. పిఠాపురంలో ఒక బలమైన సామాజిక వర్గం నూటికి ఎనభై శాతం ఉన్నారు. అయినా వర్మ 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచి విజయ ఢంకా మోగించారు అంటే అది ఆయన గొప్పతనం అంటున్నారు. ఆయన మీద అభిమానం సామాజిక హద్దులు దాటి ముందుకు సాగిందని అంటున్నారు

అలా అందరి వాడుగా ఉన్న వర్మ 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి డ్యాం ష్యూర్ గా గెలిచి ఎమ్మెల్యే కావాల్సిన వారు అని అంటారు. అయితే చివరి నిముషంలో జరిగిన రాజకీయ సమీకరణలు పొత్తుల ఎత్తులతో వర్మ సీటు చిత్తు అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. అలా ఆయన పిఠాపురాన్ని తన సొంత సీటు గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు

ఈసారి కాకపోతే వచ్చేసారి అంటే కొంత ఆశ ఉంటుంది. కానీ అది కాస్తా ఇక దక్కదు అనుకుంటేనే తీరని బెంగ ఉంటుంది. ఇపుడు పిఠాపురం వర్మ పరిస్థితి అలాగే ఉంది. వచ్చే ఎన్నికల్లో నూరు శాతం పవన్ మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ ఆయన కాదు అనుకుంటే జనసేనలో కీలక నేతలు కూడా రెడీ అంటూ కర్చీఫ్ వేశారు.

పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. కూటమిలో చిచ్చు అక్కడే మొదలైంది అని అంటున్నారు ఇటీవల జరిగిన పిఠాపురం అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో పొత్తు కుదరక జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేస్తే జనసేన నాలుగు డైరెక్టర్లను గెలుచుకుంది. ఒక డైరెక్టర్ పోస్ట్ ఇండిపెండెంట్ కి దక్కింది. ఇక్కడ టీడీపీ ఇబ్బందుల పాలు అయింది.

వర్మ అనుచరులు ఓటమి చెందారు అని అంటున్నారు. దాంతో పిఠాపురంలో వర్గం వర్గం రగులుతోంది. తమను దెబ్బ తీస్తున్నారని మండుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గా సీనియర్ నేతగా వర్మకు తగిన గౌరవం దక్కలేదని కూడా ఆయన అనుచరులు మధన పడుతున్నారు. ఇక పవన్ కి ఎమ్మెల్యే సీటు త్యాగం చేస్తే వర్మకు తొలి ఎమ్మెల్సీ పదవి అని నాడు ఇచ్చిన హామీలు ఇపుడు ఏమయ్యాయని కూడా అంటున్న నేపథ్యం ఉంది.

ఈ నేపథ్యంలో వర్మ ఇటీవల టీడీపీ అధినాయకుడు చంద్రబాబుని కలసి తన గోడు అంతా వెళ్లబోసుకున్నారని ప్రచారం సాగుతోంది. పిఠాపురంలో జనసేన టీడీపీల మధ్య పొరపొచ్చాలు ఎలా వచ్చాయి అందులో జనసేన నేతల పాత్ర ఎంతవరకూ ఉంది అన్నది ఆయన నిశితంగా వివరించారు అని అంటున్నారు దానిని చక్కదిద్దాలని కూడా ఆయన కోరుతున్నారు అని చెబుతున్నారు.

అన్ని విషయాల్లో సహాయ నిరాకరణ చేస్తున్నారని పార్టీని చులకన చేస్తున్నారు అని కూడా ఆయన ఫిర్యాదు లాంటిదే చేశారు అని అంటున్నారు. మరి దీని మీద టీడీపీ హై కమాండ్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ విధంగా వర్మకు న్యాయం చేస్తుంది అన్నది చూడాలి. ఏది ఏమైనా కూటమి సర్కార్ ఏర్పడిన ఆరు నెలల వ్యవధిలోనే పిఠాపురం నుంచే లుకలుకలు మొదలై ఇవి ఇపుడు పెద్దవి అయితే ముందు ముందు ఎలా ఉంటుంది అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు.