నాగబాబుకు మంత్రి పదవి.. వర్మ శిబిరంలో కల్లోలం.. !
జనసేన కీలక నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తున్నట్టు స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు.
By: Tupaki Desk | 10 Dec 2024 3:30 PM GMTజనసేన కీలక నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తున్నట్టు స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటన సాదాసీదాగానే ఆయన చేసినా.. రాజకీయ వర్గాల్లోనే కాకుండా.. రాష్ట్రంలోనూ సంచలనంగా మారింది. ఉభయ సభలకు ప్రాతిని ధ్యం లేని నాగబాబుకు మంత్రి వర్గంలో చోటు కల్పించడం ఆశ్చర్యంగానూ అనిపించింది. అయితే.. గతంలో కిడారి శ్రావణ్‌కుమార్‌కు కూడా.. చంద్రబాబు ఇలానే చోటు కల్పించారు.
ఇక, నాగబాబు మంత్రి కావడం ఖాయమన్న సంకేతాలు సీఎం నోటి నుంచే వెలువడడంతో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ శిబిరంలో కల్లోలం ప్రారంభమైంది. పిఠాపురం టికెట్‌ను త్యాగం చేసిన వర్మ.. ఈ ఏడాది ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌గెలుపు కోసం ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు గుర్తింపు ఉంటుందని.. క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రిపదవులు దక్కడం లేదని.. కానీ, తాను అధికారంలోకి వచ్చాక ఈ లోటు తీరుస్తానని.. ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వర్మ తనకుమంత్రి వర్గంలో చోటు దక్కుతుంద ని ఆశలు పెట్టుకున్నారు. కానీ, దక్కలేదు. పైగా.. ఇప్పుడు తనతో విభేదిస్తారన్న పేరు, ప్రచారం ఉన్న నాగబాబుకు కేబినెట్‌లో చోటు కల్పించడం వర్మకు మరింత ఇబ్బందిగా మారింది. పిఠాపురంలో వర్మకు బ్రేకులు వేస్తున్నారని నాగబాబుపై ఆయన అనుచరులు తరచుగా పోస్టులు పెడుతున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత కూడా.. వర్మకు నియోజకవర్గంలో తిరుగు ఉండదని లెక్కలు వేసుకున్నారు.
అయితే.. నాగబాబు మాత్రం.. వర్మ కేంద్రంగా పిఠాపురం రాజకీయాలు సాగకుండా జాగ్రత్తలు తీసుకుంటు న్నారన్న వాదన ఉంది. దీంతో తరచుగా జనసేన-టీడీపీ వర్గాల మధ్య పిఠాపురంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. వర్మ అనుచరులపైనా.. ఆయన ఇంటిపైనా కూడా దాడులు జరిగాయి. ఇలా.. ఉన్న సమయంలో అనూహ్యంగా నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్టు చంద్రబాబు చేసిన ప్రకటన.. మరింతగా కాక రేపింది. ఈ ప్రకటన తర్వాత.. వర్మ అనుచరులు సైలెంట్ అయిపోగా.. జనసేన వర్గం.. అర్ధరాత్రి టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం గమనార్హం. సో.. ఈ పరిణామం మున్ముందు.. ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.