పిఠాపురంలో 'వర్మ' వాహనంపై దాడి.. ఎందుకు? ఎవరు చేశారు?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు ఎస్‌వీఎస్ ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు
By: Tupaki Desk | 7 Jun 2024 8:51 PM GMTఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు ఎస్‌వీఎస్ ఎన్ వర్మపై దాడి చేశారు. విజయవాడ నుంచి పిఠాపురం వెళ్లిన ఆయన వాహనంపై రాళ్లు, కర్రలతో దాడి చేయడం అందరూ విస్తు బోయారు. అయితే.. ఈ దాడిలో వర్మ తృటిలో తప్పించుకున్నారు. దీంతో ఆయన కారు అద్దాలను.. ధ్వంసం చేసి.. సీటు కవర్లను చించేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనపై జనసేన నాయకులు కూడా విస్తు బోయారు.
ఏం జరిగింది?
పిఠాపురంలో నిన్న మొన్నటి వరకు వైసీపీ తరఫున ప్రచారం చేసి.. జనసేన కార్యకర్తలను విమర్శించిన కొందరు నాయకులు, కార్యకర్తలను విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో వర్మ.. టీడీపీలోకి చేర్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. దీనిని జనసేన కార్యకర్తలు.. ముఖ్యంగా పిఠాపురానికి చెందిన కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. ఈ క్రమంలో పిఠాపురం చేరుకున్న వర్మపై దాడికి ప్రయత్నించారు. అయితే.. ఆయన వారి నుంచి తప్పించుకున్నారు. కారు ధ్వంసమైంది. ఇక, పిఠాపురం టికెట్‌ను త్యాగం చేసి.. మరీ వర్మ ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు.. జనసేన అధినేత గెలుపు కోసం ఆయన ప్రయత్నించారు.
ఈ క్రమంలో జనసేనతో కలిసి ఆయన పని చేశారు. అప్పటి వరకు బాగానే ఉన్నా.. పిఠాపురంలో పవన్ గెలిచిన తర్వాత.. వర్మకు వ్యతిరేకంగా కొందరు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు. వర్మ వల్ల గెలవలేదని.. మెగా కుటుంబం ప్రచారంతోనే పవన్ గెలిచారని పేర్కొన్నారు. ఇక, మరికొందరు అగ్ర నేతలు కూడా.. వీరి వాదనను ఖండించలేదు. ఈ క్రమంలో వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడంపై ముఖ్యంగా పిఠాపురానికి చెందిన వారిని చేర్చుకోవడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. దీనిపై అటు పవన్, ఇటు చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి.