పవన్ గెలుపుపై వర్మ "భారీ" పందేం... అందరికీ వెల్ కం!
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఫలితాలు జూన్ 4న వెలువడనున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 May 2024 5:28 AM GMTఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఫలితాలు జూన్ 4న వెలువడనున్న సంగతి తెలిసిందే. ఇలా కౌంటింగ్ సమయం దగ్గరపడుతుండటంతో... అంచనాలు, విశ్లేషణలు, ధీమాలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. పైగా ఈసారి ప్రధానంగా రెండే రెండు ప్రశ్నలపై ఏ ఇద్దరు తెలుగు వారిమధ్య చర్చకు నిలుస్తున్నాయని అంటున్నారు.
అందులో ఒకటి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనేది ఒకటి కాగా... పిఠాపురంలో పరిస్థితి ఏమిటి? అనేది రెండో ప్రశ్న! ప్రస్తుతం ఏపీలో రాజకీయం ప్రధానంగా ఈ రెండు అంశాల చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో ఎవరి ధీమా వారికున్న సంగతి తెలిసిందే. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం అని వైసీపీ నేతలు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసిన పరిస్థితి!
మరోపక్క "మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా" అంటూ బైక్ నెంబర్ ప్లేట్స్ పై స్టిక్కరింగులు చేసేసుకుంటున్నారు జనసైనికులు. పిఠాపురంలో పవన్ గెలుపుపై వారంతా ఆ స్థాయి ధీమాతో ఉన్నారు. మరోపక్క... "మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం" అంటూ వంగ గీత అనుచరులు, వైసీపీ శ్రేణులూ బైక్స్ నెంబర్ ప్లేట్లపై రాసుకుంటున్న పరిస్థితి.
వాస్తవానికి, పవన్ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి భీమవరం, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో పవన్ గెలుపుపై జనసైనికులతో పాటు చాలా వర్గాల్లో ధీమా వ్యక్తమవుతుందని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పిఠాపురంలో పవన్ కు వెన్నుదన్నుగా నిలిచిన.. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ... పవన్ గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... పవన్ గెలుపుపై తన ఆస్తులు మొత్తం పందెం కాసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తన సవాల్ ను స్వీకరించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని అన్నారు.
పవన్ గెలుపు అనివార్యమని స్పష్టం చేశారు. దీంతో... ఈ వ్యాఖ్యలు జనసైనికుల్లో మరింత ధీమాను పెంచుతున్నాయని అంటున్నారు. కాగా... ఇప్పటికే పవన్ గెలుపు, భారీ మెజారిటీపై వర్మ పలుమార్లు స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే నిజమై.. పవన్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిస్తే అందులో వర్మ పాత్ర చాలా కీలకం అనే భావించాలి!!