Begin typing your search above and press return to search.

పిఠాపురం వర్మకు దక్కిందేంటంటే ?

పిఠాపురం వర్మ. ఈసారి ఎన్నికల వేళ ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో మారుమోగిన పేరు.

By:  Tupaki Desk   |   4 July 2024 3:27 AM GMT
పిఠాపురం వర్మకు దక్కిందేంటంటే ?
X

పిఠాపురం వర్మ. ఈసారి ఎన్నికల వేళ ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో మారుమోగిన పేరు. దానికి కారణం పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ పోటీ చేయడం. దాంతో వర్మ పోటీ చేసేందుకు గత అయిదేళ్లుగా ఎంతో శ్రమించిన చోట షాక్ తగిలింది. ఈ పరిణామాలతో వర్మ వర్గీయులు మొదట్లో నిరసనలు తెలిపారు.

అయితే టీడీపీ హై కమాండ్ వర్మను పిలిచి మాట్లాడడంతో వారంతా సైలెంట్ అయ్యారు. వర్మ సైతం పవన్ గెలుపు కోసం కృషి చేస్తాను అని ప్రకటించారు. ఆయనకు టీడీపీ హై కమాండ్ ఆనాడు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసింది అన్న ప్రచారం కూడా ఉంది. అంతే కాదు ఎన్నికల సభలలో సైతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వర్మకు సముచిత స్థానం ఇస్తామని పేర్కొన్నారు.

ఎన్నికలు ముగిసాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.అలాగే ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కూడా కాక ముందే రెండు ఎమ్మెల్సీ సీట్లు కూడా ఖాళీ అయ్యాయి. దాంతో అందులో ఒకటి వర్మకు ఖాయమని అంతా అనుకున్నారు.

తీరా చూస్తే ఒకటి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి చేరిన సీ రామచంద్రయ్యకు దక్కితే మరోటి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పి హరిప్రసాద్ కి దక్కింది. వర్మ పేరు ఎక్కడా లేకుండా పోయింది. దీనికి కారణం ఏంటి అన్నది తెలియక వర్మ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

అయితే టీడీపీ జనసేనల మధ్య పిఠాపురంలో తెలియని వార్ నడుస్తోంది అని అంటున్నారు. ఆ మధ్యన గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో వర్మపై దాడి జరిగిందన్న దాని మీద కూడా ప్రచారం పలు రకాలుగా సాగింది. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో వర్మకు విభేదాలు ఉన్నాయని అందుకే ఆయన ఎంపీకి సహకరించలేదని ప్రచారం కూడా అప్పట్లో సాగిందట. అంతే కాదు లక్ష ఓట్ల మెజారిటీ పవన్ కి అని జనసైనికులు ప్రకటించినా అనుకున్నంత స్థాయిలో మెజారిటీ రాకపోవడం వెనక కూడా జనసేనలో కొందరు గుస్సాగా ఉన్నట్లుగా చర్చ సాగింది.

పిఠాపురం నియోజకవర్గం ఇపుడు జనసేన పరం అయింది. పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంగా చేసుకున్నారు. అక్కడ మూడు ఎకరాల భూమి కూడా కొని ఇళ్ళు కట్టించుకుంటున్నారు. ఇక పవన్ 2029లోనూ ఇక్కడ నుంచే పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో వర్మ పరిస్థితి ఏంటి అన్నది ఒక చర్చగా ఉంది. మరో వైపు జనసేన వ్యవహారాలను నాగబాబు చూస్తారని ఆయనే పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జిగా ఉంటారని పవన్ లేని టైం లో మొత్తం చక్కబెడతారని అంటున్నారు.

పవన్ సైతం పిఠాపురం పర్యటనలో ప్రజల కోసం ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. మొత్తానికి వర్మకు ఎమ్మెల్సీ పదవి ఎపుడు లభిస్తుంది అంటే వేచి చూడాల్సిందే అని అంటున్నారు. జనసేన టీడీపీ ఘటబంధన్ ఉన్నంత కాలం వర్మ పిఠాపురాన్ని మరచిపోవచ్చు అని అంటున్నారు. సో అదన్న మాట మ్యాటర్.