ఐపాక్, ఆరా మస్తాన్ ముంచేశారు.. వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు!
ఇందులో భాగంగా వాలంటీర్లు, ఐప్యాక్, సీఎంవోలో అధికారులు కారణంగా చెప్పిన చోట... తాజాగా ఆరా మస్తాన్ టాపిక్ కూడా ఎత్తారు వైసీపీ మరో నేత!
By: Tupaki Desk | 10 Jun 2024 1:16 PM GMTఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తున్న వైసీపీ నేతలు... ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఘోర ఓటమికి కారణాలు చెబుతున్నారు. ఇందులో భాగంగా వాలంటీర్లు, ఐప్యాక్, సీఎంవోలో అధికారులు కారణంగా చెప్పిన చోట... తాజాగా ఆరా మస్తాన్ టాపిక్ కూడా ఎత్తారు వైసీపీ మరో నేత!
అవును... ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ నేతలు.. ఓటమికి గల కారణాలు ఇవంటూ ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెబుతున్నారు. ఇందులో భాగంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల అని అమర్నాథ్, సిదిరి అప్పలరాజు, కొట్టు సత్యనారాయణ వంటివారు చెప్పారు. ఆ వ్యవస్థ వల్ల ప్రజలకు, నేతలకు మధ్య కమ్యునికేషన్ పోయిందని అన్నారు.
ఈ సమయంలో తాజాగా తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సైతం తన మనసులో మాటను బయటపెట్టారు. తాజాగా కార్యకర్తలతో భేటీ అయిన ఆయన.. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నారు. అక్కడక్కడా పొరపాట్లు జరిగాయని అంగీకరించారు. ఈ క్రమంలోనే ఐప్యాక్, ఆరా మస్తాన్ ల ప్రస్థావన తెచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్లు చేశారు.
ఇందులో భాగంగా... ఐప్యాక్ సంస్థ వల్ల పార్టీకి ఎంతో నష్టం జరిగిందని చెప్పిన నల్లగట్ల స్వామిదాసు.. చాలామంది నేతలు, కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. గతంలో లగడపాటి టీడీపీని ముంచినట్లుగా ఇప్పుడు ఆరా మస్తాన్ వైసీపీ వాళ్లను ముంచాడని అన్నారు నల్లగట్ల. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.
కాగా... సుమారు 3 దశాబ్ధాల పాటు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిన స్వామిదాసు 2024 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీలో చేరారు. అంతకముందు 1994, 99 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలో ఇటీవల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈయన.. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ చేతిలో 21,874 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.